తమ ఊరికి దూరంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలు వద్దంటూ ఆందోళనకు దిగిన ఎస్సీ మహిళలతో హోంమంత్రి మేకతోటి సుచరిత వాదనకు దిగిన సంఘటన యనమదలలో చోటుచేసుకుంది. యనమదల గ్రామ మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన లేఅవుట్లలో ఆమె పట్టాలు అందిస్తుండగా ఎస్సీ కాలనీకి చెందిన కొందరు మహిళలు 2 కిలోమీటర్ల దూరంలో ఇస్తున్న ఇళ్ల పట్టాలు తమకు వద్దని, దగ్గరలో ఉన్న ఈదులపాలెం గ్రామ మహిళలకు ఇచ్చిన లేఅవుట్లో ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. పట్టాలు అవసరం లేకపోతే వెనక్కు ఇచ్చేయండని చెప్పి భోజనానికి వెళ్లారు. ఈ సమాధానంతో మహిళలు ఆందోళనకు దిగారు. ఎన్నికల సమయంలో రాత్రింబవళ్లు తిరిగి మంత్రి గెలుపునకు పనిచేశామని, ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్నందుకు ద్రోహం చేశారంటూ ఆరోపించారు. 300 గడపల్లో 23 మందికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇళ్లు మంజూరు చేశారని, రేషన్ దుకాణాలు, పిల్లల పాఠశాలలు, పనులకు తిరిగేందుకు రవాణా ఛార్జీలు చెల్లించలేమని వాపోయారు. అనంతరం వారు మంత్రి వద్దకు చేరుకొని నిలదీశారు. ఈదులపాలెం లేఅవుట్‌లో స్థలం లేదని మంత్రి చెప్పగా కొనుగోలు చేసి ఇవ్వాలని కోరారు. మిమ్మలను నమ్ముకున్నందుకు మీరు చేసే న్యాయం ఇదేనా అంటూ ప్రశ్నించారు.
ఇళ్ల పట్టాలు వద్దనుకుంటే వెనక్కి ఇవ్వండి: హోంమంత్రి సుచరిత
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదలో ఇళ్ల పట్టాలు ఊరికి దూరంగా ఇచ్చారంటూ ఎస్సీ మహిళలు ఆందోళన చేయడంపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాలు వద్దనుకుంటే వెనక్కి ఇవ్వాలన్నారు.
ఆగ్రహంతో మంత్రి సుచరిత ‘న్యాయం చేయడం మాకు రాదు. మీకు వచ్చు కదా’ అంటూ వాదనకు దిగారు. ‘మీరు మాట్లాడే దానికి అర్థం ఉందా’ అనగా, ‘ఎందుకండి..’ అని ఓ మహిళ అనడంతో ‘ఏంటి చెప్పు’ అంటూ మంత్రి సుచరిత కాస్త దూకుడుగా ముందుకు వెళ్లారు. అక్కడే ఉన్న కొందరు మహిళలను నియంత్రించడంతో వారు నెమ్మదించారు. తమ 23 మందికీ దగ్గరలోనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, ఇక్కడ వద్దని చెప్పడంతో సరేనంటూ మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదీ చదవండి:జనవరి 20 వరకు ఇళ్ల స్థలాల పంపిణీ: సీఎం జగన్