ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం తగ్గిందని హోంమంత్రి సుచరిత అన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా అవసరమైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం చురుగ్గా పని చేస్తోందన్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో రవాణా సమస్య తీరేలా.. రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కోరినట్లు చెప్పారు. దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుచరిత పాల్గొన్నారు.
'రాష్ట్రంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 5 నుంచి 2కి తగ్గాయి. విశాఖ, తూ.గో. జిల్లాల్లోనే కొంత మావోయిస్టుల ప్రభావం ఉంది. 2019-21 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50 మంది నక్సల్స్ ఉన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక పాలనా వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మన్యంలోనూ అనేక సేవలు అందుతున్నాయి. గిరిజనులకు విద్య, వైద్య, మౌలిక సౌకర్యాలు కల్పించాం. నక్సల్స్ ప్రాంతాలకు అదనపు బెటాలియన్స్ ఇవ్వాలని కోరాం. విశాఖ జిల్లాలో గతంలోనే నక్సల్స్ ప్రభావం ఉండేది. నక్సల్ ప్రభావానికి, రాష్ట్ర రాజధానికి సంబంధం లేదు' - హోంమంత్రి మేకతోటి సుచరిత