High Tempers in AP: హీట్ వేవ్ పరిస్థితులు రాష్ట్రాన్ని నిప్పుల కుంపటిలా మార్చాయి. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతల తీవ్రత గరిష్ఠానికిచేరిపోయింది. వడగాలులు, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 40-46 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీంతో మరో నాలుగైదు రోజుల పాటు ఏపీలో ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాయవ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హీట్ వేవ్ పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 46 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. రాష్ట్రంలో వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తీక్షణమైన ఎండవేడి కారణంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే భానుడు సెగలు కక్కుతున్నాడు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న పరిస్థితులు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో నెలకొన్నాయి.
రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లా పెద్దారవీడులో 46.05 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మద్దిపాడులో 45.6 డిగ్రీలు, నెల్లూరులో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. తిరుపతి, వెంకటగిరి, నద్యాల, పలనాడులోని నరసరావుపేటలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. బాపట్ల, గుంటూరు, కర్నూలు, కడప, యర్రగొండపాలెం , మార్కాపురంలలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. అల్లూరి, నంద్యాల,ఏలూరు, ద్వారకాతిరుమల, గురజాల, కంభం, డోర్నాల , సూళ్లురుపేటలలో 42 డిగ్రీలు నమోదైంది. శ్రీకాకుళం, చిత్తూరు, అన్నమయ్య, కృష్ణా, అనంతపురం, ఎన్టీఆర్, అనంతపురం 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు రికార్డులు చెబుతున్నాయి.
రాష్ట్రంలో హీట్ వేవ్ పరిస్థితుల దృష్ట్యా ఈ నెల 21 తేదీ వరకూ ఏపీలో 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలియచేసింది. ప్రత్యేకించి కోస్తాంధ్ర జిల్లాలైన ఉభయ గోదావరి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు , బాపట్ల ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. ఆ తదుపరి కొంతమేర ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి: