ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు మిర్చియార్డులో మచ్చుకాయల చిచ్చు - హమాలీపై దాడి!

High Tension at Guntur Mirchi Yard: గుంటూరు మిర్చియార్డులో హమాలీపై భద్రతా సిబ్బంది దాడి చేయడం వివాదానికి దారి తీసింది. ఓ హమాలీ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేయడంతో గొడవ మొదలైంది. తన వద్ద ఎలాంటి కాయలు లేవని చెబుతున్నా తనిఖీ చేసి దాడి చేశారని బాధిత హమాలీ ఆరోపించారు. హమాలీపై దాడి చేసిన ఇద్దరు భద్రతా సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2024, 7:51 PM IST

High Tension at Guntur Mirchi Yard
High Tension at Guntur Mirchi Yard

High Tension at Guntur Mirchi Yard: గుంటూరు మిర్చియార్డులో మరోసారి మచ్చుకాయల వివాదం చెలరేగింది. మిర్చి తీసుకెళ్తున్నారంటూ ఓ హమాలీపై భద్రతా సిబ్బంది దాడి చేయడం వివాదానికి దారి తీసింది. తమ వద్ద కాయలు లేకపోయినా దాడి చేశారని బాధిత హమాలీతో పాటు కూలీలంతా ఆందోళనకు దిగారు. మిర్చియార్డు ఛైర్మన్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యకలాపాలన్నీ నిలిచిపోవడంతో అధికారులు దిగొచ్చారు. హమాలీపై దాడి చేసిన ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు.

గుంటూరు మిర్చియార్డులో మచ్చుకాయల చిచ్చు - హమాలీపై దాడి!

దేశంలోనే మిర్చి అమ్మకాలకు గుంటూరు మార్కెట్ యార్డు ప్రసిద్ధి. ఇక్కడ నిత్యం కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. రైతులు పంటను తెచ్చి యార్డులో అమ్ముకునే క్రమంలో కూలీలు కొన్ని కాయల్ని మచ్చుగా తీసుకుంటారు. అలా సేకరించిన కాయలన్నింటినీ సాయంత్రానికి బయట వేరే దుకాణాల్లో హమాలీలు అమ్ముకుంటారు. ఈ సేకరణ సరికాదని రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, కట్టడి చేయలేని పరిస్థితి. మిర్చియార్డు కొత్త పాలకవర్గం వచ్చాక మచ్చు సేకరణను నిషేధిస్తూ తీర్మానం చేసింది. భద్రతా సిబ్బందిని పెట్టి హమాలీలను తనిఖీ చేయిస్తోంది. ఈ క్రమంలో ఓ హమాలీ వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని భద్రతా సిబ్బంది తనిఖీ చేయడంతో గొడవ మొదలైంది. తన వద్ద ఎలాంటి కాయలు లేవని చెబుతున్నా తనిఖీ చేసి దాడి చేశారని బాధిత హమాలీ ఆరోపించారు.
రూ.500 నుంచి రూ.1000 తగ్గిన ఘాటు ధర-వెనకడుగు వేస్తోన్న రైతన్న!

హమాలీపై విషయం తెలుసుకున్న సహచర హమాలీలు భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు. యార్డులో కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. యార్డు పరిపాలనా కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి కార్యాలయంలో లేరు. అక్కడే కాసేపు బైఠాయించి హమాలీలంతా ఆందోళన చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి మిర్చి యార్డు గేటు వద్ద ఉన్న ఛైర్మన్ ఫ్లెక్సీలను చించివేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు. అధికారులు ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. రైతుల నుంచి తాము తీసుకున్న కాయల్ని తీసుకెళ్లడం నేరం ఎలా అవుతుందని హమాలీలు ప్రశ్నించారు.
ఐడియా అదిరింది: మిర్చిలో నల్లతామరకు.. సోలార్ లైట్ చెక్! తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి

మచ్చు విషయంపై గతేడాది నవంబర్‌లోనూ ఓసారి ఆందోళన జరిగింది. హమాలీలు యార్డు ఛైర్మన్ కార్యాలయం ముట్టడించారు. అయితే హమాలీలకు కూలీ వస్తుంది కాబట్టి మళ్లీ మచ్చు పేరుతో కాయలు తీసుకెళ్లడం సరికాదన్నది పాలకవర్గం వాదన. అందుకే కూలీలు కాయల్ని బయటకు తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించింది. మచ్చుకు అడ్డుకట్ట పడటంతో కూలీల అదనపు ఆదాయానికి గండి పడింది. దీంతో మిర్చియార్డులో పనిచేసే వారంతా తరచూ ఆందోళనలు చేస్తున్నారు. అయితే తమ వద్ద పట్టుకున్న మిర్చిని యార్డు ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ అమ్ముకుంటున్నారని హమాలీలు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి మచ్చు సేకరణ చేస్తుంటే ఎలా నిషేధిస్తారని కూలీలు ప్రశ్నిస్తున్నారు.
మిరప పంట పీకేసీ వైసీపీ జెండాలు పాతారు - కన్నీటి పర్యంతమైన బాధిత మహిళా రైతు

మిర్చియార్డుకు వచ్చే రైతులు నష్టపోకూడదనే మచ్చుపై నిషేధం విధిస్తున్నట్లు పాలకవర్గం చెబుతోంది. అయితే బలవంతంగా తీసుకునేదానికి, రైతులు ఇష్టపడి ఇచ్చేదానికి తేడా ఉందని, ఈ విషయం పట్టించుకోకుండా తమని దొంగల్లా చూడటం సరికాదని హమాలీలు అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details