High temperatures in Guntur: ఉక్కపోత, ఎండవేడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలుల ప్రభావం స్ఫష్టంగా కనిపిస్తోంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియచేసింది. అన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతోంది. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోయినట్టు భారత వాతావరణ విభాగం తెలియచేసింది. ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలకు చేరువైంది.
సాధారణంగానే వేసవి ఎండలు అధికంగా ఉండే గుంటూరు జిల్లాలో.. ఈ ఏడాది ఉష్ణోగ్రతల్లో మార్పులతో తీవ్రత మరింత పెరిగింది. ఠారెత్తిస్తోన్న ఎండల దాటికి రహదార్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మండే ఎండలకు తోడు వడగాడ్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఠారెత్తిస్తోన్న ఎండల దాటికి ప్రజలు రోడ్లమీదకి రావడానికి హడలెత్తిపోతున్నారు.
చెట్లు కొట్టేయడంతో ఎండలోనే నిరీక్షణ..గుంటూరులో మండుటెండలు నడినెత్తిన చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం పతాకస్థాయికి చేరింది. ఉమ్మడి గుంటూరుతో పాటు తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే తీవ్రత పెరిగి.. ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. కొందరు ప్రయాణికులు మండుటెండల్లోనూ ప్రయాణించక తప్పని పరిస్థితి. ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఆటోడ్రైవర్లు.. ఇలా అన్నివర్గాల ప్రజలు వేసవి తాపానికి విలవిల్లాడుతున్నారు. గుంటూరు నగరంలో చెట్లు కొట్టేయడంతో చాలా చోట్ల ప్రయాణికులు ఎండలోనే నిరీక్షించాల్సి వస్తుంది. మే నెల మధ్యలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.