Summer Effect : భానుడు భగ్గుమంటున్నాడు. వేసవి కాలం రానే వచ్చింది. మరల ఉసూరుమనే నిట్టూర్పులు మొదలయ్యాయి. మాడు పగిలిపోయేలా విధంగా నిప్పులు కురిపిస్తున్నాడు భానుడు. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్టోగ్రత కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవేం ఎండలు బాబోయ్ అనుకుంటూ ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. కొన్ని చోట్ల రికార్డు స్థాయిలో వేడి పెరిగిపోతోంది. ఈ వేడికి తోడు వడ గాల్పులు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏప్రిల్ ప్రారంభంలోనే ఈ స్థాయిలో ఉష్ణోగత్రలు ఉంటే మే నెలలో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ప్రజలు భయపడుతున్నారు.
వడ గాల్పులు : ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్టు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగినట్టు వాతావరణశాఖ తెలియజేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 150కి పైగా మండలాల్లో వడ గాల్పులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతల తీవ్రత మరింతగా పెరిగింది.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు :కర్నూలు జిల్లా జి.సింగవరంలో 44 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ప్రకాశం జిల్లా జువ్విగుంటలోనూ 44 డిగ్రీల మేర ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వాతావరణశాఖ పేర్కోంది. ఇక విజయనగరం లో 43.7 డిగ్రీలు, తిరుపతి 43.46 డిగ్రీలు, రాజాం లో 43.8 డిగ్రీలు ,కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు 43.7 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.