గుంటూరు జిల్లా నరసరావుపేట కొవిడ్ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్, నాదెండ్ల పీహెచ్‌సీ వైద్యుడు సోమ్లానాయక్ మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడం, డాక్టర్‌ని అరెస్టు చేయాలని కలెక్టర్ ఆదేశించడం సంచలనంగా మారింది. వైద్యుడిని డీఎస్పీ బంగ్లాకు తీసుకెళ్లడం, అనంతరం ఆయన క్షమాపణలు చెప్పడం.. రెండు గంటల పాటు బంగ్లా వద్ద హైడ్రామా నడిచింది. కలెక్టర్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్‌చల్ చేశాయి.
డాక్టరుని అరెస్టు చేస్తామనడంపై ప్రభుత్వ వైద్యులు, ఆ సంఘం ప్రతినిధులు కలెక్టర్ తీరును తప్పుబట్టారు. వైద్యుడిని డీఎస్పీ బంగ్లాలో కూర్చొబెట్టారని తెలియడంతో వైద్య సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. వైద్యునికి మద్దతుగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీంతో డీఎస్పీ వీరారెడ్డి ఉన్నతాధికారులతో చర్చించారు. అదే సమయంలో వైద్యుడితోనూ పలువురు సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. కొవిడ్‌పై సమావేశం ముగిసిన అనంతరం జిల్లా ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు వైద్యుడు సోమ్లానాయక్ బంగ్లా నుంచి బయటకు వచ్చి... కొన్ని పరిస్థితుల వలన జిల్లా కలెక్టర్ ఎదుట ఆవేశంగా మాట్లాడానని...దీనికి ఆయనను క్షమాపణ కోరినట్టు వెల్లడించారు.