High Court On CGF Funds: కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిధులు కార్యాలయాల నిర్మాణం కోసం వినియోగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. సీజీఎఫ్ నిధులు దేవాదాయ శాఖ కార్యాలయాల నిర్మాణం కోసం వాడటంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. సీజీఎఫ్ సొమ్ముతో దేవాదాయశాఖ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఫండ్‌తో ప్రభుత్వాన్ని నడపలేరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిర్మాణాలకు అనుమతిస్తే రేపు ఆఫీసుల్లో స్టేషనరీ, వెహికల్స్, పెట్రోల్ కి కూడా ఈ సొమ్మునే వినియోగిస్తారని వ్యాఖ్యలు చేసింది. సీజీఎఫ్ నిధులను నిర్మాణాలకు విడుదల చేయడంపై జర్నలిస్ట్ మంత్రిప్రగడ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపున వాదనలు న్యాయవాది సోమయాజి వాదనలు వినిపించారు. ఈ నిధులు దూపదీప నైవేద్యాలకే ఉపయోగించాలని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తదుపరి విచారణను వాయిదా వేసింది.
High Court On Visakha Lands: విశాఖ మర్రిపాలెం భూమి వ్యవహారంలో ప్రభుత్వానికి చుక్కెదురు. విశాఖపట్నం, మర్రిపాలెం భూమి వ్యవహారంలో ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది. సింగిల్ జడ్జ్ తీర్పులో జోక్యం చేసుకోలేమని డివిజనల్ బెంచ్ స్పష్టం చేసింది. విశాఖపట్నంలో తనకు చట్టబద్దంగా ఉన్న 17 వేల 135 చ.మీ రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను కొట్టివేయాలని వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేష్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పై విచారణ చేసిన సింగిల్ జడ్జి జీఓని కొట్టివేస్తూ గతంలో ఉత్తర్వులిచ్చింది. సింగిల్ జడ్జ్ ఉత్తర్వులను డివిజినల్ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్ చేసింది. ప్రభుత్వ అప్పీల్‌పై ధర్మాసనం విచారణ జరిపి..యధాతధ స్థితిని పాటించాలని గతంలో మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి, మరో న్యాయవాది వీ.వీ సతీష్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టేసింది.