ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

75 ఏళ్ల చరిత్రలో ఇలాంటి జీవో రాలేదు.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు - సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

high court
high court

By

Published : Jan 12, 2023, 4:10 PM IST

Updated : Jan 13, 2023, 6:51 AM IST

16:06 January 12

విచారణ ఈనెల 20కి వాయిదా వేసిన హైకోర్టు

HC Suspended The GO No 1: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్‌ 1 అమలు విషయంలో... రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈనెల 23 వరకు జీవో అమలును హైకోర్టు ధర్మాసనం నిలిపేసింది. పోలీసు చట్టం సెక్షన్ 30కి విరుద్ధంగా ఆ జీవో ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇలాంటి జీవో ఎవరూ తీసుకురాలేదని తీవ్రస్థాయిలో మండిపడింది. బ్రిటీషోళ్లు ఇలాంటి జీవో తెచ్చే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా అని నిలదీసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమయం కోరడంతో విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేశాక.. ఇతర అంశాల్లోకి వెళతామని తెలిపింది.

"పోలీసు చట్టం 1861 నుంచి అమల్లో ఉంది. అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇలాంటి జీవో తెచ్చి ఉంటే స్వాతంత్య్ర ఉద్యమం జరిగేదా? బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేవారా..?. బ్రిటిష్ కాలంలోనూ ఇలాంటి జీవో తీసుకురాలేదు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలోనూ ఇలాంటి జీవో తీసుకురాలేదు. అంతకు ముందూ లేదు. 75 ఏళ్లుగా ఎవరూ రహదారులపై బహిరంగ సభలు పెట్టలేదా? మనం ఏ రోజుల్లో ఉన్నామో అర్థం కావడం లేదు" అంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 1పై విచారణ వేళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ వీఆర్కే కృపాసాగర్​తో కూడిన ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

రహదారులపై బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా ఇచ్చిన జీవో1ని సవాల్‌ చేస్తూ సీపీఐ కార్యదర్శి కె. రామకృష్ణ వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. స్వాతంత్రోద్యమ సమయంలో.. ర్యాలీలు, బహిరంగ సభలను అడ్డుకునేందుకు బ్రిటీష్ ప్రభుత్వం కేవలం 144 సెక్షన్ విధించిందని, ఇలాంటి ఉత్తర్వులివ్వలేదని.. సహాయ నిరాకరణోద్యమంలో సైతం ఇలాంటి అవరోధం కలిగించలేదని...పిటిషనర్‌ తరపు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదించారు. జీవోలో నిషేధం అనే పదం వినియోగించకుండా ప్రభుత్వం పరోక్షంగా... ఆ పని చేసిందని పేర్కొన్నారు.

శాంతియుత వాతావరణంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించుకోవచ్చని అధికరణ 19(1) భావప్రకటన స్వేచ్ఛను.. కల్పిస్తోందన్నారు. శాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలకు.. పోలీసుల అనుమతి అవసరం లేదన్నారు. అరుదైన, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సమావేశాలకు అనుమతిచ్చే అంశాన్ని పోలీసులు పరిశీలించాలని..జీవో 1లో పేర్కొన్నట్లు తెలిపారు. పోలీసుల దగ్గరకువెళ్లి ప్రత్యేక పరిస్థితులున్నాయని నిరూపించుకోవాల్సిన అవసరం ఏముందన్నారు. నచ్చినవారికి అనుమతి ఇచ్చి, నచ్చని వారికి నిరాకరించడం కోసం ఇలాంటి షరతు పెట్టారన్నారు. బహిరంగ సమావేశాల నియంత్రణ ముసుగులో.. ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధిస్తోందని వాదించారు. జీవో 1అమలును నిలుపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.

పిల్ విచారణ అర్హ్హతపై ప్రభుత్వం తరపున వాదించిన ఏజీ శ్రీరామ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. 10 రోజుల కిందట ఇచ్చిన జీవో అని ఏ రాజకీయ పార్టీలు అనుమతి కోసం దరఖాస్తులు చేయలేదని, వాటిని తిరస్కరించలేదని తెలిపారు. విచారణార్హతపై ఏజీ అభ్యంతరం చెప్పడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రజాప్రయోజనం ఉందని న్యాయస్థానం భావించి అత్యవసర విచారణకు అనుమతి ఇచ్చాక అభ్యంతరం చెప్పడం ఏమిటని ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం విచారణకురాకుండా తెరవెనుక ఏం జరిగిందో తమకు తెలుసని..ఆ విషయాన్ని బెంచ్‌మీద నుంచే చెప్పేలా చేయవద్దని హెచ్చరించింది.

మూడోపక్షం హైకోర్టు రిజిస్ట్రీ వ్యవహారాలను ప్రభావితం చేస్తోందని ఏ కేసు ఏ ధర్మాసనం విచారించాలో నిర్ణయిస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై విచారణ చేయిస్తామని హెచ్చరించింది. తమ ముందు వాదనలు వినిపించేందుకు ఇష్టం లేకపోతే చెప్పాలని.. పిటిషన్‌ వేరే బెంచ్‌కు పంపుతామని తేల్చిచెప్పింది. ఏజీ వాదనలు కొనసాగిస్తూ పూర్తి స్థాయి నిషేధం విధిస్తున్నారనే ఆలోచనతో పిటిషనర్ వ్యాజ్యం వేశారని అది నిజం కాదన్నారు. కందుకూరులో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో... ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందన్నారు. ర్యాలీలు, రోడ్ షో, పాదయాత్రలపై ఎలాంటి నిషేధం విధించలేదని స్పష్టం చేశారు. రహదారులపై బహిరంగసభల విషయంలో.. ముందస్తు అనుమతి తీసుకోవాలని మాత్రమే జీవోలో ఉందన్నారు.

పరిపాలనపరంగా జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వ పాలసీ నిర్ణయంగా ఎలాచెబుతారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. విధానపరమైన నిర్ణయానికి కార్యనిర్వాహక ఉత్తర్వులకు తేడా ఉంటుందని తెలిపింది. పోలీసు చట్టం సెక్షన్ 30కి విరుద్ధంగా జీవో 1 ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడుతూ దానిని సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సమయం కోరడంతో విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Jan 13, 2023, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details