ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాల ప్రాంగణాల్లో సచివాలయాల నిర్మాణాల కేసు.. సింగిల్​ జడ్డ్​ విచారణపై స్టే - పిల్

HC STAY ON SINGLE BENCH ENQUIRY :కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో.. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలపై సింగిల్ జడ్జి నిర్వహిస్తున్న విచారణపై ధర్మాసనం స్టే విధించింది.

HC STAY ON SINGLE BENCH ENQUIRY
HC STAY ON SINGLE BENCH ENQUIRY

By

Published : Feb 28, 2023, 9:50 AM IST

HC STAY ON SINGLE BENCH ENQUIRY : కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో.. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలపై సింగిల్ జడ్జి నిర్వహిస్తున్న విచారణపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) నేతృత్వంలోని ధర్మాసనం స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఆర్.రఘునందన్​ రావుతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

గ్రామ పంచాయతీల్లో.. గ్రామ సచివాలయాలు భాగం కాదని ఒక పిటిషన్​లో రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలిపిన నేపథ్యంలో.. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం విడుదల చేసిన నిధులను వార్డు, గ్రామ సచివాలయాల భవనాల నిర్మాణానికి వినియోగించొచ్చా, ఆ మేరకు రాష్ట్రం ప్రత్యేక అనుమతి ఏమైనా తీసుకుందా అనే విషయాల్లో స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని ఆదేశిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 14న మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అయితే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో రెవెన్యూ, విద్యా, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కర్నూలు కలెక్టర్ అప్పీల్ వేశారు.

విచారణ పరిధిని విస్తరిస్తున్నారు: సోమవారం జరిగిన విచారణలో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ తన వాదన వినిపిస్తూ 'సింగిల్ జడ్జి ఈ వ్యాజ్యాల పై విచారణ చేస్తూ.. ప్రజాహిత వ్యాజ్యం (పిల్) పై చేసే విచారణ తరహాలో లోతుగా వెళుతున్నారు. విచారణ పరిధిని విస్తరిస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని స్కూల్లలో సచివాలయాల నిర్మాణాన్ని సవాలు చేస్తూ పిటిషన్​లు దాఖలు చేశారు. అయితే ఇప్పటికే నిర్మించిన భవనాలను పాఠశాల విద్యాశాఖకు అప్పగించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యాజ్యాల పై ఈ నెల 14న విచారణ జరిపిన సింగిల్ జడ్జి కేంద్ర ప్రభుత్వాన్ని సుమోటోగా ప్రతివాదిగా చేర్చారు. ఉపాధి హామీ నిధులను వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి అనుమతి తీసుకుందా? లేదా? స్పష్టత ఇవ్వాలని కోరారు' అని ధర్మాసనానికి వివరించారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ విచారణ వాయిదా వేసింది.

అసలేమిటీ కథ:పాఠశాలల ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదని 2020 జూన్‌ 11న హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ.. 2021లో పలు పిటిషన్​లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ప్రభుత్వ పాఠశాలల స్థలాల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకునే నిమిత్తం సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కోర్టుకు సహాయకులుగా సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తిని నియమించింది. ఈ అంశంపై గత కొన్నిరోజులుగా విచారణలు జరుగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా హైకోర్టు సింగిల్​ బెంచ్​ విచారణనూ డివిజన్​ బెంచ్​ స్టే విధించింది.

ABOUT THE AUTHOR

...view details