HIGH COURT ORDERS TO GOVT : పోలీసు కానిస్టేబుల్ పరీక్షలో ఎనిమిది ప్రశ్నలకు సరైన జవాబులు నిర్ణయించలేదంటూ 80 మంది అభ్యర్థులు దాఖలు చేసిన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు నియామక బోర్డు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో దేహదారుఢ్య పరీక్షకు పిటిషనర్లను అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బోర్డు వేసే కౌంటర్ పరిశీలించాక తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ మేరకు స్పష్టం చేశారు.
పోలీసు కానిస్టేబుల్ ప్రాథమిక రాతపరీక్ష ప్రశ్నా పత్రంలో ఎనిమిది ప్రశ్నలకు సరైన సమాధానాలను నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుఢ్య పరీక్షకు అనర్హులయ్యామని పేర్కొంటూ 80 మంది హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. అకాడమీ పుస్తకాల్లో ఉన్న జవాబులకు భిన్నంగా తుది ‘కీ’ విడుదల చేశారన్నారు. ఆ ఎనిమిది ప్రశ్నల జవాబులను నిపుణుల కమిటీ తేల్చేలా ఆదేశించాలని.. ఈ లోపు పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని కోరారు. కీ లో తప్పుల కారణంగా అభ్యర్థులకు అన్యాయం చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. కీ లో నిర్దిష్టమైన తప్పులున్నప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చని తెలిపారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటిషనర్ల జవాబులను మరోసారి పరిశీలించాలని ప్రభుత్వం, పోలీసు నియామకం బోర్డు తరఫు న్యాయవాది కిశోర్‌కుమార్‌కు సూచించారు.