గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తనపై పెట్టిన కేసును రద్దు చేయాలని కోరుతూ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది న్యాయస్థానం. నర్సరావుపేటకు చెందిన బుజ్జి వెంకాయమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తనపై చీటింగ్, ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మంది నిందితుల్లో తనను రెండో నిందితురాలిగా పేర్కొన్నారన్నారు. పిటిషనర్‌కు సంబంధం లేకపోయినా సివిల్ వివాదంలో కేసు నమోదు చేశారని ఆరోపించారు. 2014 లో జరిగిన ఘటనపై ఇప్పుడు కేసు నమోదు చేశారని తెలిపారు. దీని ఆధారంగా కేసును కొట్టేయాలని కోరారు.
హైకోర్టులో కోడెల కుమార్తె పిటిషన్‌పై... రిజర్వులో తీర్పు
మాజీ స్పీకర్ కోడెల కుమార్తె వేసిన పిటీషన్‌పై వాదోపవాదనలు విన్న హైకోర్టు... మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచింది.
పిటిషనర్‌పై మొత్తం 15 కేసులు నమోదయ్యాయని ఫిర్యాదుదారు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా పిటీషనర్ అడ్డుపడ్డారని న్యాయవాది తెలిపారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని కేసును కొట్టివేయరాదని ధర్మాసనాన్ని కోరారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై తీర్పును రిజర్వులో ఉంచారు. పిటిషనర్ పై ఉన్న 15 కేసుల వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది ధర్మాసనం.
ఇదీ చదవండి:అవినీతి అంతం... అందరి బాధ్యత: సీఎం జగన్