ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

HC on Nimmagadda: నిమ్మగడ్డ రమేష్​కుమార్​కు స్వేచ్ఛ.. ఓటరుగా పేరు నమోదుకు హైకోర్టు ఓకే - ap high court

High Court on EX SEC Nimmgadda Ramesh Kumar: గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా పేరు నమోదు కోసం ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారికి తగిన దస్త్రాలతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఆయన దరఖాస్తుపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.

High Court
High Court

By

Published : Jul 14, 2023, 10:50 AM IST

High Court on EX SEC Nimmgadda Ramesh Kumar:గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా పేరు నమోదు కోసం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారికి తగిన దస్త్రాలతో దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. రమేష్ కుమార్ సమర్పించిన దరఖాస్తుపై చట్ట నిబంధనల మేరకు నిర్దిష్ట సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈమేరకు తీర్పు ఇచ్చారు. తన స్వగ్రామం గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటరుగా పేరు నమోదు చేయాలంటూ ఇచ్చిన వినతిని చీఫ్ ఎలక్టోరల్ అధికారి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ 2021లో హైకోర్టును ఆశ్రయించారు.

దుగ్గిరాలలో మొదట ఓటరుగా పేరు నమోదు చేసుకున్నానని, తర్వాత హైదరాబాద్​కు ఓటును బదిలీ చేయించుకున్నానన్నారు. పదవీ విరమణ చేసిన నేపథ్యంలో సొంత ఊరులో ఓటు కల్పించాలని చేసిన వినతిని అధికారులు తిరస్కరించడానికి సహేతుకమైన కారణం లేదన్నారు. ఓటరుగా ఎక్కడ పేరు నమోదు చేసుకోవాలనే విషయంపై రాజ్యాంగం పౌరుడికి ఐచ్ఛికాన్ని ఇచ్చిందన్నారు. దుగ్గిరాల ఓటరు జాబితాలో తన పేరును చేర్చేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. తాజాగా నిర్ణయం వెల్లడిస్తూ పిటిషనర్ పేరును జాబితాలో చేర్చాలని ఆదేశించేందుకు నిరాకరించారు. వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు. ఓటరుగా పేరు చేర్చాలని కోరుతూ తాజాగా దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛను మాజీ ఎన్ఎస్ఈసీకి ఇచ్చారు.

ధార్మిక పరిషత్‌ చట్టబద్ధతపై హైకోర్టులో వ్యాజ్యం:ధార్మిక పరిషత్ ఏర్పాటుకు వీలుకల్పిస్తున్న దేవదాయ సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయలేదని, ఈ నేపథ్యంలో పరిషత్ ఏర్పాటు చెల్లుబాటుకాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి, ధార్మిక పరిషత్ సభ్య కార్యదర్శి, దేవాదాయ కమిషనర్​కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అడ్వొజరీ కౌన్సిల్ స్థానంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసేందుకు వీలుగా 2007లో రాష్ట్రప్రభుత్వం దేవాదాయ చట్టానికి సవరణ తీసుకొచ్చిందని, ఆ సవరణ చట్టానికి ఇప్పటి వరకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయలేదని పేర్కొంటూ స్వామి హతీరాం మఠ్ పూర్వ మహంత్ అర్జున్ దాస్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపించారు. దేవాదాయ సవరణ చట్టానికి (యాక్ట్ 33/2007) రాష్ట్రపతి ఆమోద ముద్ర లేదన్నారు. అలాంటప్పుడు ధార్మిక పరిషత్ ఏర్పాటు చెల్లదన్నారు. ధార్మిక పరిషత్లో హిందూమతానికి సంబంధంలేని వ్యక్తుల జోక్యం ఎక్కువైందన్నారు. పిటిషనరు తరచూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details