HC on Disciplinary Proceedings: అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ డీ. ప్రభాకర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనపై ప్రభుత్వం జారీ చేసిన క్రమశిక్షణ చర్యల ఉత్తర్వుల విచారణ జాప్యం కారణంగా తనపై అభియోగ పత్రాన్ని కొట్టివేయాలంటూ ఆయన హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై.. విచారణ చేపట్టిన హైకోర్టు.. జాప్యం చోటు చేసుకుందన్న కారణంతో ప్రభుత్వ ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యల ఉత్తర్వులను కొట్టివేయలేమని స్పష్టం చేసింది. జాప్యం చేయడం శిక్ష విధించిన దానికంటే మనోవేదన ఎక్కువ కలుగుతోందన్న వాదనను పరిగణనలోకి తీసుకొని క్రమశిక్షణ ఉత్తర్వులను కొట్టివేయలేమని తెలిపింది. జాప్యం జరిగిందన్న కారణంతో పిటిషనర్‌పై అభియోగపత్రాన్ని కొట్టేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది.
మూడు నెలల్లో క్రమశిక్షణ విచారణను ముగింపు పలకాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేసింది. నిర్దిష్ట సమయంలో ప్రక్రియను ముగించకుంటే పిటిషనర్‌పై మోసిన అభియోగాలు వాటంతట అవే రద్దువుతాయని వెల్లడించింది. మరోవైపు క్రమశిక్షణ చర్యల ఉత్తర్వులు, షోకాజ్ నోటీసు, అభియోగపత్రాన్ని ప్రాథమిక దశలో కొట్టివేయలేమని తెలిపింది. అది అపరిపక్వ దశ అని పేర్కొంది. ప్రభావితమైన వ్యక్తులు తుది ఉత్తర్వులను మాత్రమే సవాలు చేయగలరని పేర్కొంది. పరిధి లేకుండా షోకాజ్ ఇచ్చిన సందర్భంలోనే న్యాయస్థానాలు జోక్యం చేసుకోగలవని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
కాగా.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, మద్యం విక్రయం విషయంలో మామూళ్లు వసూలు చేశారని, అక్రమాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోలేదని.. తదితర ఆరోపణలతో అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్‌గా డీ. ప్రభాకర్‌పై 2013లో ప్రభుత్వం క్రమశిక్షణ ఉత్తర్వులు జారీసింది. ఈ వ్యవహారం ట్రైబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ వద్ద విచారణ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు ఈ విషయంలో తార్కిక ముగింపు లభించలేదని, తీవ్ర జాప్యం చోటు చేసుకున్నందున తనపై జారీచేసిన క్రమశిక్షణ ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ప్రభాకర్ 2021లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు.
ప్రభుత్వ ఉద్యోగులపై ప్రారంభించిన క్రమశిక్షణ కేసులను ఆరు నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని, ఇతర కేసుల్లో మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. జాప్యం మానసిక వేదనకు గురిచేస్తోందని ఆయన తెలిపారు. శాఖాపరమైన ప్రొసీడింగ్స్ పూర్తి చేయడానికి తొమ్మిదేళ్ల ఆలస్యం చేశారని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వ న్యాయవాది కిశోర్‌కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని, జాప్యం కారణంగా చూపి అతడిపై జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయడానికి వీల్లేదని ఆయన అన్నారు. క్రమశిక్షణ ప్రొసీడింగ్స్‌ను ట్రైబ్యునల్‌కు బదిలీ చేశామని తెలిపిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత విచారణకు నోచుకోలేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. జాప్యం చేసుకుందన్న కారణంతో క్రమశిక్షణ చర్యల ఉత్తర్వులను కొట్టేయలేమని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: