High Court Notices to 41 People Including CM Jagan:సీఎం జగన్, మంత్రులు, ఆయన సన్నిహితులకు.. లబ్ది చేకూరేలా జరిగిన అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేసి.. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయాలని.. రఘురామ హైకోర్టులో పిల్ వేశారు. ప్రభుత్వ ఖజనాకు జరిగిన నష్టాన్ని తేల్చే బాధ్యతను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కిరణ్మయిల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. సీఎం జగన్‌తో పాటు సమాచార పౌర సంబంధాల ముఖ్యకార్యదర్శి పక్షపాత ధోరణితో ప్రభుత్వ సంబంధ వార్తలు, ప్రకటనలను ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్‌కు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనం కల్పించారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
- భారతి, దాల్మియా, పెన్నా, మరో అయిదు కంపెనీలకు సింహభాగం సిమెంట్ కొనుగోలు ఆర్డర్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్, గనులశాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అక్రమ నిర్ణయాలు తీసుకున్నారని రఘురామఆరోపించారు.
- 104, 108 అంబులెన్సుల నిర్వహణను అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు అప్పగించడంలో జగన్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అవినీతికి పాల్పడ్డారని పిటిషన్‌లో తెలిపారు.
- ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు, కాకినాడ సీ పోర్టులను అరబిందో రియాల్టీ సంస్థకు అప్పగించే విషయంలో ముఖ్యమంత్రి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక సీఎస్ అక్రమాలకు పాల్పడ్డారన్నారు.
- జగన్, గనుల శాఖ, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు అవినీతికి పాల్పడి ఇసుక తవ్వకాలను చెన్నైకి చెందిన టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌కు అప్పగించారని ఆరోపించారు.
జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్ - ఈ నెల 24న విచారణ చేపడతామన్న ధర్మాసనం
పేదలకు ఒక సెంటు స్థలం ముసుగులో ప్రైవేటు సంప్రదింపుల ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడి ప్రైవేటు వ్యక్తుల భూములతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్నారు. కొన్ని కంపెనీలకే ఎక్కువ భాగం మద్యం కొనుగోలు ఆర్డర్లను అప్పగించే విషయంలోనూ జగన్, ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్, బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్‌లో అభియోగాలు మోపారు. జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కార్యదర్శులు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పటికీ కేంద్ర హోంశాఖ మౌనం వహిస్తోందని ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తు చేసేలా సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించాలని పిటిషన్ ద్వారా కోరారు.
రాజకీయ వైరంతో పిటిషన్.. హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ పిల్ విచారణ అర్హతపై అభ్యంతరం లేవనెత్తారు. రిట్ రూల్స్‌కు విరుద్ధంగా ఉందని.. పూర్తి వివరాలను ప్రస్తావించలేదన్నారు. పిటిషనర్‌ను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ విప్ స్పీకర్‌కు లేఖ రాశారని ఆ విషయాన్ని పిల్ డిక్లరేషన్‌లో పేర్కొనలేదని తెలిపారు. పిటిషనర్ డైరెక్టర్‌గా ఉన్న ఓ కంపెనీ 700 కోట్లు చెల్లించడంలో విఫలమైందని.. ఈ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయాన్ని పిల్‌లో పేర్కొనలేదని ఏజీ శ్రీరామ్ వాదించారు. పిల్ దాఖలు తర్వాత ముఖ్యమంత్రిని వదలనని.. మీడియా ముందు ప్రకటన చేశారన్నారు. దురుద్దేశంతో, రాజకీయ వైరంతోనే ఈ పిటిషన్ వేశారని ఆరోపించారు. ఎంపీ రఘురామ తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు స్పందిస్తూ ఏజీ చెబుతున్న కారణాలు పిల్ దాఖలుకు అడ్డంకి కాదని తెలిపారు.