High Court Comments on Demolition of Shops: అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామంలోని దుకాణాలు కూల్చిన చోటే పునర్నిర్మించి పిటిషనర్లకు అప్పగించాలని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గ్రామకంఠం భూమిలో పలువురు నిర్మించిన దుకాణాల్ని కూల్చివేయడంతో అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామపంచాయతీ అధికారులపై కన్నెర్ర చేసింది. స్థలాన్ని పిటిషనర్లకు స్వాధీనపరచాలని, కూల్చిన చోటే తొమ్మిది నెలల్లో దుకాణాలను పునర్నిర్మించి పిటిషనర్లకు అప్పగించాలని కశింకోట పంచాయతీ కార్యదర్శిని ఆదేశించింది.
నిర్మాణంలో జాప్యం చేసినా, నిర్దేశించిన సమయంలో దుకాణాలు నిర్మించకపోయినా.. పిటిషనర్లే పునర్నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపింది. అందుకు అయిన ఖర్చును గ్రామపంచాయతీ నుంచి రాబట్టుకోవచ్చని పేర్కొంది. మరోవైపు గ్రామకంఠం భూములు గ్రామపంచాయతీకి సంక్రమించినవి కాదని, ఇదే వ్యవహారంపై హైకోర్టు పలుమార్లు తీర్పులు ఇచ్చిందని గుర్తుచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్‌రావు ఇటీవల ఈమేరకు కీలక తీర్పు ఇచ్చారు.
అసలేం జరిగిందంటే: అనకాపల్లి జిల్లా కశింకోట గ్రామంలోని సర్వే నంబరు 110/1లోని గ్రామకంఠం భూమిలో వి.పాపారావు, డి.శ్రీదేవి, పి.వెంకటలక్ష్మి దుకాణాలు నిర్మించుకొని జీవనాధారం నిమిత్తం వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దుకాణాలను ఖాళీ చేయాలని కశింకోట పంచాయతీ అధికారులు రెండు సార్లు నోటీసు ఇచ్చారు. వాటికి పిటిషనర్లు తిరుగు సమాధానం ఇచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కూల్చివేత విషయంలో ముందుకెళుతున్నారని పేర్కొంటూ పాపారావు, ఇద్దరు మహిళలు(పిటిషనర్లు) 2022 నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు.
వ్యాజ్యం హైకోర్టు పరిశీలనలో ఉండగానే దుకాణాలను కూల్చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వేనంబరు 110/1లో ఉన్న 164 ఎకరాలు గ్రామకంఠం భూమిగా వర్గీకరించారన్నారు. గ్రామకంఠం భూములు గ్రామపంచాయతీకి చెందినవి కావని హైకోర్టు పలు సందర్భాల్లో తీర్పులు ఇచ్చిందన్నారు. ముఖ్యంగా బన్నె గాంధీ వర్సెస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, తదితర కేసుల్లో హైకోర్టు స్పష్టంచేసిందన్నారు. దుకాణాలను తిరిగి నిర్మించి, వాటిని పిటిషనర్లకు అప్పగించేలా గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఆదేశించాలన్నారు.