Judge Somayajulu At Ugadi Sahithi Vasanthotsavam: మన సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని.. వీటిని పరిరక్షించుకోవాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాహితీ వసంతోత్సవంలో జస్టిస్ సోమయాజులు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాడుగల నాగపణి శర్మ, కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ గురవారెడ్డి, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఉగాది సందర్భంగా కూర్మనాథస్వామి పంచాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో భాగంగా పాడుతా తీయగా ఫేం రేటూరి గాయత్రీ దేవి, చిత్రకారుడు కూచి వినూత్న ప్రదర్శన ఇచ్చారు. పాట పాడేలోగా.. కూచి చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు. అనంతరం ఈ ఉగాది వేడుకలో భాగంగా మాట్లాడిన జస్టిస్ సోమయాజులు.. ఒకప్పటి మన దేశానికి ఇప్పటి మన దేశానికి ఎంతో తేడా ఉందని చెప్పారు.
200 ఏళ్ల పాటు విదేశీయులు మన దేశానికి వచ్చి దేశ సంపదను దోచుకుని.. మన దేశాన్ని నాశనం చేశారని, అయితే ఈ 80 ఏళ్లలో మన దేశం చాలా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సమయంలో ఎన్నో దేశాలకు వ్యాక్సిన్స్ సరఫరా చేసిన ఘనత మనదేనని ఆయన చెప్పారు. దీంతో పాటు రష్యా- ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకోకూడదని ఆంక్షలు విధించినా.. మన దేశం అందుకు తలవంచలేదని జస్టిస్ సోమయాజులు పేర్కొన్నారు.