ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CID Case: హైకోర్టులో అమరావతి రాజధాని అసైన్డ్‌ భూముల కేసు విచారణ..

EX Minister Narayana CID Case: రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసుల విచారణ హైకోర్టులో కొనసాగుతోంది. రాజకీయ ప్రతికారంతోనే పిటిషనర్లపై ఫిర్యాదు చేశారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

High Court
హైకోర్టు

By

Published : Jul 21, 2023, 3:04 PM IST

CID Case on EX Minister Narayana: రాజధాని అమరావతి అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసు.. చెల్లుబాటు కాదని సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో వాదనలు వినిపించారు. రాజకీయ ప్రతీకారంతోనే వారిపై మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారని.. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

అసైన్డ్‌ భూముల వ్యవహారమై 2016 ఫిబ్రవరి 17న జారీచేసిన జీవో 41 సదుద్దేశంతో జారీచేశారని గుర్తు చేశారు. ఆ జీవో జారీకి సంబంధించిన నోట్‌ఫైల్‌ను పరిశీలిస్తే ఆయాశాఖల అధికారులెవరు అభ్యంతరం తెలపలేదని కోర్టుకు వివరించారు. అసైన్డ్‌ రైతుల ప్రయోజనాలను కాపాడటం కోసమే జీవో 41 తెచ్చారన్నారు. ఆ జీవో జారీ అయిన 32 రోజుల తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి దానిని ధ్రువీకరించారని తెలిపారు. జీవో జారీ వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని.. జీవో ఇచ్చిన అయిదేళ్ల తర్వాత రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. పిటిషనర్లపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటుకావని న్యాయస్థానం ముందుంచారు. పూర్తిస్థాయి వాదనలకు తగిన సమయం లేకపోవడంతో విచారణ నేటికి వాయిదా వేసింది. విచారణను వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే కృపాసాగర్‌ ఆదేశాలు జారీ చేశారు.

అసైన్డ్‌ భూముల ఆంశంలో ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని.. వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఆయన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ 2021 మార్చిలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి. నారాయణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అటు తరువాత వారిపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ ఇరువురు నేతలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు ధాఖలు చేశారు. ఈ పిటిషన్లపై 2021 మార్చి 19న విచారణ జరిపిన న్యాయస్థానం.. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలన్నింటిని నిలుపుదల చేసింది. రాజధాని నగరం నిర్మాణంలో భాగంగా.. ప్రభుత్వం, అథార్టీ, అధికారి, వ్యక్తి చేపట్టిన చర్యలపై దావా వేయడం, ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం నిషేధం ఉందని గుర్తు చేసింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు తుది విచారణను ప్రారంభించింది.

అసైన్డ్‌ రైతుల ప్రయోజనాల కోసం 2016 ఫిబ్రవరిలో సదుద్దేశంతోనే జీవో 41 తెచ్చారని పిటీషనర్ తరపు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఆ జీవోలోని నిబంధనలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని ఫైలు నడిచిన సమయంలో పేర్కొనలేదన్నారు. జీవో జారీకి ముందు న్యాయశాఖ, ఏజీ అభిప్రాయం సైతం తీసుకున్నారని తెలిపారు. నష్టపోయామని భావించిన అస్సైనీదారులు, పరిహారం దక్కదని భావించి మూడోపక్షానికి(థర్డ్‌పార్టీ) విక్రయించుకున్నవారు జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించవచ్చన్నారు. ఆ భూములను వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉందన్నారు. అంతేకాకా బాధితులకు మళ్లీ రీ ఎసైన్‌ చేసే వెసులుబాటు ఉందని వాదించారు. బాధితుడు కాని వ్యక్తి, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఎలాంటి ఆధారాలు లేకుండా సీఐడీకి ఫిర్యాదు చేశారని వాదనలు వినిపించారు.

2016లో జారీ చేసిన జీవో వ్యవహారమై అయిదేళ్ల తర్వాత.. 2021లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసిందన్నారు. ప్రభుత్వం జారీచేసిన జీవోతో తాము నష్టపోయామని ఎస్సీ, ఎస్టీలు ఎవరు ఫిర్యాదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 18.. నిబంధనలను రూపొందించేందుకు అధికారం కల్పిస్తోందన్నారు. ఆ అధికారాన్ని వినియోగించుకుని జీవో జారీచేశారని తెలిపారు. భూసమీకరణ పథకాన్ని సక్రమంగా అమలు చేసి, న్యాయపరమైన చిక్కులకు తావివ్వకుండా రాజధాని అమరావతి నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలన్న ఉద్దేశంతో జీవో 41 తీసుకొచ్చారని వివరించారు. జీవో తీసుకురావడమే నేరంగా ఫిర్యాదుదారుడు భావిస్తున్నారన్నారని.. దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని వాదించారు. జీవో 41ని ప్రసుత్త ప్రభుత్వం సమీక్షించి స్వల్ప సవరణ చేసి.. 2019 డిసెంబర్‌ 31న జీవో 316ను తీసుకొచ్చిందన్నారు. దీనిని బట్టి జీవో 41 చట్టబద్ధమైనదని స్పష్టమవుతోందని కోర్టుకు తెలిపారు.

జీవో 41ని తీసుకురావడానికి గుంటూరు జిల్లా కలెక్టర్‌ ప్రతిపాదన పెట్టారని న్యాయవాది వాదనలు వినిపించారు. పురపాలకశాఖ, రెవెన్యూ శాఖలు ఆమోదం తర్వాత కార్యదర్శి జీవో జారీచేశారన్నారు. 32రోజుల తర్వాత జీవోను అప్పటి ముఖ్యమంత్రి ధ్రువీకరించినట్లు తెలిపారు. జీవో జారీకి పిటిషనర్లకు సంబంధం లేదని.. ఒకవేళ జీవో చట్టవిరుద్ధం అనుకుంటే ఫైలు ప్రారంభం నుంచి జీవో విడుదల వరకు బాధ్యులైన అధికారులను నిందితులుగా చేర్చాల్సి ఉంటుందని వాదించారు. వాస్తవానికి నిబంధనలను రూపొందించడానికి అధికారులకు సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 18 అధికారాలు కల్పిస్తోందని.. అనర్హులకు రిటర్నబుల్‌ ప్లాట్లు కేటాయించారని ఫిర్యాదుదారుడు ఆరోపిస్తున్నారన్నారని న్యాయస్థానం ముందుంచారు. ఈ వ్యవహారంతో పిటిషనర్లకు సంబంధం లేదన్నారు. ఒకవేళ అలాంటిదే జరిగిఉండుంటే అందుకు సంబంధిత అధికారులు బాధ్యులవుతారని తెలిపారు.

భూసమీకరణ పథకం కింద భూములిచ్చిన రైతుల టైటిల్‌ విషయంలో అధికారులు సంతృప్తి చెందితేనే వారికి ప్రయోజనాలు కల్పిస్తారన్నారు. రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితాలో ఉండే అసైన్డ్‌ భూములను చట్టబద్ధంగా ఇతరులకు బదిలీ చేయడానికి వీల్లేదని వాదనలు వినిపించారు. ఎవరైనా రిజిస్ట్రేషన్‌ కోసం వెళితే అడ్డుకోవాల్సిన బాధ్యత రిజిస్ట్రార్లదేనన్నారు. జీవో జారీ వెనుక దురుద్దేశం ఉందని, పిటిషనర్ల పాత్ర ఉందని ఫిర్యాదు, ప్రాథమిక విచారణ నివేదికలో సైతం వెల్లడి కాలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజధాని నగరం నిర్మాణం విషయంతో తీసుకున్న నిర్ణయాల విషయంలో సీఆర్‌డీఏ చట్టంలోని సెక్షన్‌ 146 ప్రకారం.. ప్రభుత్వం, అధికారులకు ప్రాసిక్యూషన్‌ నుంచి నిషేధం ఉందన్నారు. ఆ సెక్షన్‌ వారికి రక్షణగా నిలుస్తోందని.. చట్టం దాఖలు పరిచిన అధికారాన్ని వినియోగించి జీవో జారీచేస్తే నేరం ఎలా అవుతుందని ప్రశ్నలను కోర్టుకు వినిపించారు. పిటిషనర్లపై కేసు నమోదు చేయడం నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని వాదించారు.

ABOUT THE AUTHOR

...view details