High Court: అమరావతి నుంచి అరసవల్లి వరకు చేపట్టిన మహాపాదయాత్రను 600 మంది రైతులు మాత్రమే నిర్వహించాలని ఇతరులు రహదారులకు ఇరువైపుల నిలబడి సంఘీభావం తెలపాలని... ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. బుధవారం విచారణ జరిపింది. పాదయాత్ర విషయంలో అమరావతి పరిరక్షణ సమితి దాఖలు చేసిన వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్ జడ్జి విధించిన షరతులతో తమకు సంఘీభావం తెలియజేసే హక్కు లేకుండా పోతోందంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఈ అప్పీళ్లు దాఖలు చేశాయి.
వారి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. మూడు రాజధానులంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాజధానికి భూములిచ్చిన రైతులకు కలిగిన ఇబ్బందులను ప్రజలకు వివరించేందుకు పాదయాత్ర చేస్తున్నారని కోర్టుకు వివరించారు. 600 మంది మాత్రమే యాత్ర నిర్వహించాలని..., ఇతరులు రహదారుల పక్కన నిలబడి సంఘీభావం తెలపాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు..... పిటిషనర్లకు విఘాతంగా మారాయని, వారి హక్కులను హరిస్తున్నాయని వాదించారు.
పాదయాత్ర 600 మంది మాత్రమే నిర్వహించాలని.. కోర్టు ఎలా నిర్ణయిస్తుందని ఆయన ప్రశ్నించారు. పాదయాత్రలో కలిసి నడిచేందుకు పిటిషనర్ల సంఘ సభ్యులకు అనుమతి ఇవ్వాలని కోరారు. రాజధాని అమరావతే అని త్రిసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చాక పాదయాత్ర ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు ఏర్పాటు విషయంలో కర్నూలులో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని వ్యాఖ్యానించింది. కర్నూలులో... హైకోర్టు ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ విధానం అని అందుకే అక్కడ నిరసన కార్యక్రమాలను ప్రోత్సహిస్తోందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా... మూడు రాజధానులకు అనుకూలంగా మంత్రులు..రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఇలాంటి చర్యలు అభినందించదగినవి కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ నిర్ణయం తప్పు అని, నిరసన తెలియజేసే హక్కు పౌరులకు ఉంటుందని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. ఎవరైనా నిరసన తెలియజేస్తుంటే వారికి సంఘీభావం తెలపడం, నిరసన తెలియజేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని గుర్తుచేశారు. దానిని నిరాకరించడానికి వీల్లేదన్న ఆయన సింగిల్ జడ్జి ఉత్తర్వులను సాకుగా చూపి పాదయాత్రకు వెళ్లే వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని తెలిపారు. గుర్తింపు కార్డులున్నవారినే అనుమతి ఇస్తామనడం ఎంతమాత్రం సమంజసమని ప్రశ్నించారు. సంఘీభావం తెలిపేవారిని పోలీసులు సంఘ విద్రోహశక్తులుగా పరిగణిస్తున్నారని..పేర్కొన్నారు. యాత్ర శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని తెలిపారు.
భారత్ జోడో యాత్ర పేరుతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న రాజకీయ యాత్రకు లేని షరతులు రాజధాని కోసం జీవనాధారమైన భూములిచ్చిన రైతులు చేస్తున్న యాత్రకు ఎందుకు అని ప్రశ్నించారు. పాదయాత్ర విషయంలో సింగిల్‌జడ్జి వద్ద మీరు వ్యాజ్యం దాఖలుచేసుకోవాలని హైకోర్టు సూచించింది. అమరావతి పరిరక్షణ సమితి వేసిన వ్యాజ్యంలో.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై మీరెలా అప్పీల్ వేస్తారని దానికి ఏవిధంగా విచారణ అర్హత ఉంటుందని ప్రశ్నించింది. ఇలాంటివన్ని రైతులను ముందు ఉంచి నిర్వహించే రాజకీయ పాదయాత్రలు అని వ్యాఖ్యానించింది.
రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలతో.. హైకోర్టు బిజీగా ఉందని, ఇలాంటి చర్యలు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం కోసమేనని భావిస్తున్నామని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ శ్రీరామ్ సంఘీభావం తెలియజేసే పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రాథమిక హక్కు కాదన్నారు. కోర్టు ఆదేశాలను పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఉల్లంఘించారన్నారు. అప్పీల్ దాఖలు చేయడానికి అనుమతి కోరుతూ..పిటిషనర్లు వేసిన అనుబంధ పిటిషన్లో కౌంటర్ వేశామన్నారు. సంబంధిత కౌంటర్ కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడం వల్ల విచారణ ఈనెల 7కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. కౌంటర్ దస్త్రాన్ని రికార్డుల్లో చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ఇవీ చదవండి: