HC ON MUPPALA ARREST : రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబరు 1ని రద్దు చేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు, భారత న్యాయవాదుల సంఘం ఏపీ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావును తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం 1వ పట్టణ పోలీసులు అక్రమ అరెస్ట్ చేయడంపై హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలైంది. సుబ్బారావు కుమారుడు విశాల్ స్ఫూర్తి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు, జస్టిస్ వి.శ్రీనివాస్‌తో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వ్యాజ్యం వేశాక సుబ్బారావును విడిచిపెట్టినట్లు పోలీసుల తరఫు ప్రభుత్వ న్యాయవాది తెలిపారని వెంకటేశ్వర్లు అన్నారు. ముప్పాళ్లను అక్రమ అరెస్ట్ చేసిన క్రమంలో బాధ్యులైన పోలీసుల నుంచి 2లక్షల రూపాయల పరిహారం ఇప్పించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పరిహారం వ్యవహారంపై కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
మరోవైపు జీవో నెంబర్ 1ను వ్యతిరేకిస్తూ శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చినందుకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్, న్యాయవాది మునిస్వామిని పోలీసులు అక్రమంగా గృహ నిర్బంధం చేయడాన్ని ఐలు(అఖిలభారత న్యాయవాదుల సంఘం), న్యాయ విద్యార్థుల విభాగం ఖండించింది. నిరసన తెలియజేసే హక్కుకు పోలీసులు విఘాతం కలిగించారని మండిపడింది. జీవో 1ని రద్దు చేయాలని కన్వీనర్ పచ్చా కిరణ్, కో కన్వీనర్ జాషువా డానియేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. మరోవైపు అక్రమ అరెస్ట్‌లు, నిర్బంధాలను ఖండిస్తున్నట్లు లాయర్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఛైర్మన్, హైకోర్టు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ మరో ప్రకటన విడుదల చేశారు. ప్రజల పక్షాన నిలబడే న్యాయవాదులు అక్రమంగా నిర్బంధించడం సరికాదన్నారు.