High Court Serious on IAS Officials: కోర్టు ధిక్కారణ కేసుల్లో తరుచూ న్యాయస్థానం ఎదుట హాజరవుతున్న I.A.S. అధికారులను ఉద్దేశించి హైకోర్టు తీవ్రంగా మండిపడింది. రోజూ మిమ్మల్ని చూడడానికి చికాకేస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. ఓ కేసు సందర్భంగా శుక్రవారం విచారణకు హాజరైన పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి గోపాకకృష్ణ ద్వివేది, ఆర్థికశాఖ కార్యదర్శి రావత్‌లను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ ఇద్దరు అధికారులే సుమారు 70 సార్లు కోర్టు ధిక్కారణ వ్యాజ్యాల్లో న్యాయస్థానం ముందు హాజరయ్యారని గుర్తుచేసింది.
దేశంలో మిగిలిన హైకోర్టుల్లో పోలిస్తే.. ఇక్కడే ఎక్కువ సంఖ్యలో ధిక్కారణ వ్యాజ్యాలు నమోదవుతున్నాయని మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల తీరువల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పడానికి ఏమాత్రం సంకోశించడం లేదని తేల్చిచెప్పింది. అధికారులు కోర్టు ఆదేశాలను సరైన స్ఫూర్తితో అమలు చేయడం లేదని తప్పుబట్టింది. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన తర్వాతే న్యాయస్థానం ఉత్తర్వులు అమలు చేస్తున్నారంటే...అధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. కోర్టు తీర్పు అంటే లెక్కలేని తనమా లేక ఏమవుతుందిలే అనే బరితెగింపా అని తీవ్రస్థాయిలో మండిపడింది.
ఉపాధి హామీ బిల్లులు చెల్లించడ లేదంటూ ప్రకాశం జిల్లా తాడివారిపల్లెకు చెందిన కంచర్ల కాశయ్య2022లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 4 వారాల్లో బిల్లులు చెల్లించాలని ఆదేశించింది. అధికారులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో ఆయన ధిక్కారణ వ్యాఖ్యం దాఖలు చేశారు.ఇటీవల దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రతివాదులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఆర్థికశాఖ కార్యదర్శి రావత్, పంచాయతీరాజ్‌శాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ద్వివేదితోపాటు ఇతర అధికారులు హాజరయ్యారు.
కోర్టు హాలులో గోపాలకృష్ణ ద్వివేది, రావత్‌ను చూసిన న్యాయమూర్తి.. ఈనెల 2న విచారణకు వచ్చారు. మళ్లీ ఈరోజు వచ్చారు.. అసను ఎన్ని కేసుల్లో కోర్టుకు హాజరై ఉంటారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సుమారు 60-70సార్లు వచ్చి ఉంటారని బదులిచ్చారు. పిటిషనర్‌కు ఈ ఏడాది జనవరి 23న సొమ్ము చెల్లించినట్లు అధికారులు తెలపగా.. కోర్టు ఉత్తర్వులు అలవాటు ప్రకారం అమలు చేయరు, మళ్లీ విచారణకు హాజరుకావాలని ఆదేశించాకే పిటిషనర్‌కు సొమ్ములు వేశారని న్యాయమూర్తి గుర్తుచేశారు. వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశిస్తేనే కోర్టు ఉత్తర్వులు అమలు చేస్తామనేది అధికారుల ఉద్దేశమైతే.. ప్రతికోర్టు ధిక్కరణ కేసులోనూ మొదటి విచారణలోనే హాజరుకు ఆదేశిస్తామన్నారు.