Bail to Adireddy Apparao in Jagajjanani Case: జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుకు హైకోర్టులో ఉపశమనం లభించింది. వీరిద్దరికీ బెయిల్ మంజూరు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జగజ్జనని చిట్ ఫండ్ కేసులో ఇద్దరిపై CID కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు సీఐడీ పేర్కొంది. బెయిల్ కోసం అప్పారావు, వాసు హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. చిట్ ఫండ్ చట్టం ఈ కేసుకు వర్తించదని.. పిటిషనర్లు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. డిపాజిట్‌దారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకుండానే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసుకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతకుముందు సోమవారం నాడు బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయస్థానం నేడు తీర్పును వెలువరించింది.
సోమవారం నాడు సాగిన వాదనలు ఇలా ఉన్నాయి.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. చిట్ నిర్వహణలో ఏదైనా లోపాలను చిట్ సహాయ రిజిస్ట్రార్ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్ వ్యవహరించారన్నారు. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషన్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందన్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీలలో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు.