హైకోర్టుకు సీఎస్ జవహర్‌రెడ్డి హాజరు కావాలని ఆదేశం HC ORDERS TO CS JAWAHAR REEDY : న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాలు, ఇతర నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు వద్దని 2020 జూన్‌లో తాము ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టి నిర్మాణాలు సాగించారని.. మండిపడింది.
అవి అక్రమ నిర్మాణాలేనని తేల్చింది. వాటికి చెల్లింపులు సైతం అక్రమమేని పేర్కొంది. అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వ ఖజానా నుంచి సొమ్ము చెల్లించినందుకు సంబంధిత అధికారులను బాధ్యులను చేసి వారి నుంచి సొమ్ము రాబడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. పాఠశాల విద్య, పురపాలకశాఖ, పంచాయతీరాజ్ శాఖలతో ముడిపడి ఉన్న వ్యవహారం... కాబట్టి సీఎస్ హాజరుకు ఆదేశిస్తున్నట్లు పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ బుధవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు.
పాఠశాలల ప్రాంగణాల్లో ఎలాంటి నిర్మాణాలకు వీల్లేదని 2020 జూన్ 11న హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ.. నిర్మాణాలు కొనసాగిస్తున్నారని పేర్కొంటూ... 2021లో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ పాఠశాలల స్థలాల రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకునే నిమిత్తం సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కోర్టుకు సహాయకులుగా సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తిని నియమించింది.
పాఠశాలల్లో నిర్మాణాల తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో, ప్రస్తుత పరిస్థితి ఏమిటో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బుధవారం జరిగిన విచారణలో ప్రభుత్వం నివేదికను కోర్టు ముందుంచింది. దానిని పరిశీలించిన న్యాయమూర్తి నిర్మాణాల తొలగింపు విషయంలో ఎలాంటి పురోగతి లేదన్నారు. సీఎస్ సమావేశం నిర్వహిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నాం.. అని చెప్పడం తప్ప చర్యలు శూన్యమని పేర్కొన్నారు. అధికారుల తీరు తీవ్ర అసంతృప్తికి, ఆవేదనకు గురి చేస్తోందన్నారు.
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. వివిధ శాఖలతో ముడిపడి ఉన్న వ్యవహారం కాబట్టి కోర్టు ఆదేశాల అమలులో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. 239 పాఠశాలల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు ప్రారంభించామని..., 63 చోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. మిగిలినచోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. గుత్తేదారులకు 40 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. మిగిలిన పనులకు 22 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. నిర్మాణాలు పూర్తయితే సంబంధిత పాఠశాలలైనా వినియోగించుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.
ఈ వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. విద్యార్థులు చదువుకునే వాతావరణం చెడిపోకూడదనే ఉద్దేశంతో పాఠశాలల ప్రాంగణాల్లో ఇతర నిర్మాణాలు వద్దని ఆదేశాలిచ్చామని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వుల జారీ తర్వాత కూడా సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ చేసినవి కాబట్టి అవి అక్రమ నిర్మాణాలేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి గుత్తేదారులకు సొమ్ము చెల్లించడం అక్రమమేనన్నారు. బాధ్యులైన అధికారుల నుంచి ఆ సొమ్మును రాబడతామని తేల్చిచెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 22న తమ ముందు హాజరుకావాలని సీఎస్‌ను ఆదేశించారు.
ఇవీ చదవండి: