HIGH COURT ORDERS TO CEC : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం వచ్చిన దరఖాస్తులకు జత చేసిన సర్వీసు సంబంధ ధ్రువపత్రాలపై జిల్లా విద్యాశాఖ అధికారుల సంతకాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను హైకోర్టు ఆదేశించింది. జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) సంతకాలు లేని వాటిని తిరస్కరించాలని తేల్చి చెప్పింది. అధికారి సంతకాలు లేని వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా వేశారు. ఆ రోజు విచారణలో వివరాలను కోర్టు ముందు ఉంచాలని స్పష్టం చేశారు.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఏపీ ప్రధాన కార్యదర్శి తిమ్మన్న హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, న్యాయవాది చలసాని వెంకట్ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.