ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్విస్‌ ఛాలెంజ్‌పై ఏదో ఒకటి తేల్చండి'

స్విస్ ఛాలెంజ్‌పై ఏదో ఒక నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధాని వ్యవహారంలోనూ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని సూచించింది. హైకోర్టు పరిధిలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు సరైన సౌకర్యాల్లేవని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు

By

Published : Oct 24, 2019, 2:39 PM IST

Updated : Oct 24, 2019, 4:28 PM IST

స్విస్‌ ఛాలెంజ్‌ విధానం, అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ వైఖరి తెలియజేయాలని హైకోర్టు సూచించింది. రాజధాని వ్యవహారంలోనూ తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఎనేబులింగ్‌ చట్ట నిబంధనలను అనుసరించి స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం గత ప్రభుత్వం సింగపూర్‌ సంస్థలతో ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై గత నెల రెండు విడతల వాదనలు జరిగాయి.

న్యాయస్థానం అసంతృప్తి

ఇవాళ జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. సింగపూర్‌ సంస్థలతో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంలో అభివృద్ధి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం పున:సమీక్ష జరుపుతోందని... ఈ కేసును నాలుగు వారాలకు వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. ఇప్పటికే పలుమార్లు వాదనలు, వాయిదాలు జరుగుతున్నాయని... ప్రభుత్వం ఏదో ఓ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం సరికాదని హైకోర్టు ఆక్షేపించింది.

టీ దొరకడం కూడా కష్టమే

హైకోర్టు పరిధిలో న్యాయమూర్తులు, న్యాయవాదులకు సరైన సౌకర్యాలు లేవని తప్పుబట్టింది. న్యాయమూర్తులు, న్యాయవాదులకు మౌలిక వసతుల కల్పన విషయంలో గత నాలుగు నెలలుగా ఎలాంటి చర్యలూ చేపడుతున్నట్లు లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రాంతంలో కప్పు టీ దొరకడమూ కష్టంగా ఉంటోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయకుండా తమ వైఖరిని వెల్లడించాలని ఆదేశించింది. రెండు వారాల్లో స్విస్‌ ఛాలెంజ్‌ విధానంతో పాటు, రాజధాని అంశంలోనూ కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది.

Last Updated : Oct 24, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details