HC ENQUIRY ON CID DSP PETITION: సీమెన్స్ సంస్థ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్‌ను జ్యుడీషియల్ రిమాండ్‌కు ఇచ్చేందుకు విజయవాడలోని మూడో అదనపు జిల్లా కోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మంగళరిగి సీఐడీ డీఎస్పీ హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఎస్ భానుమతి విచారణ జరిపారు. జీవీఎస్ భాస్కర్‌కు నోటీసులు జారీ చేశారు. ఆయన తరఫు న్యాయవాది వీఆర్ మాచవరం వాదనల కోసం విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీఐడీ తరఫున వాదనలు వినిపించారు.
"తీవ్రమైన నేరాల్లో సైతం న్యాయాధికారులు కొన్ని చోట్ల రిమాండ్‌ను తిరస్కరిస్తున్నారన్నారు. నిందితులను వదిలేసి, 41ఏ నోటీసు ఇవ్వాలని యాంత్రిక ధోరణిలో ఆదేశాలిస్తున్నారన్నారు. రిమాండ్ దశలో మినీ ట్రైల్ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. భాస్కర్ ఇతర నిందితులతో కలిసి ప్రాజెక్టు వ్యయాన్ని 3వేల 300 కోట్ల రూపాయలకు పెంచారన్నారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 371 కోట్ల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. భాస్కర్ భార్య, ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అపర్ణ ఉపాధ్యాయను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్లో డిప్యూటీ సీఈవోగా నియమించుకున్నారని తెలిపారు. ఈ చర్య పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందికొస్తుందని ఆరోపించారు. ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలేదని పేర్కొన్నారు. అవగాహన ఒప్పందం, ప్రాజెక్టు అంచాన విలువను భాస్కర్ తారుమారు చేశారన్నారు. పబ్లిక్ సరెంట్ల నిర్వచనం కిందకు ఆయన రాకపోయినా.. కుట్రలో భాగస్వామి అన్నారు. ఐపీసీ సెక్షన్ 409 ఆయనకు వర్తించదని న్యాయమూర్తి పేర్కొనడం సరికాదు అని పేర్కొన్నారు. భాస్కర్ విషయంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.