HIGH COURT ON HOME GUARDS : హోం గార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. కానిస్టేబుల్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించి.. ప్రాథమిక రాత పరీక్ష, మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి, పోలీసు నియామక బోర్డు ఛైర్మన్, డీజీపీకి నోటీసులు జారీచేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక క్యాటగిరీగా పనరిగణించక పోవడాన్ని సవాలు చేస్తూ సీహెచ్ గోపి మరో ముగ్గురు హోం గార్డులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు వేశారు. సాధారణ అభ్యర్థులకు మాదిరిగా తమకు కటాఫ్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారు. ప్రాథమిక పరీక్షలో అర్హత మార్కులు సాధించలేదన్న కారణంతో తమను దేహదారుఢ్య పరీక్షకు అనర్హులుగా పేర్కొన్నారన్నారు. వారి తరఫున న్యాయవాది జి.శీనకుమార్ వాదనలు వినిపించారు.
కటాఫ్ మార్కుల విషయంలో జనరల్ క్యాటరిగి అభ్యర్థులతో సమానంగా హోం గార్డులను పరిగణించడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం పోలీసు నియామక బోర్డు జారీ చేసిన ప్రకటనలో ప్రాథమిక రాత పరీక్షలో ఓసీలకు 80, బీసీలకు 70, ఎస్సీ, ఎస్టీలకు 60 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారన్నారు. ఆ ప్రకారం దేహదారుఢ్య పరీక్షకు ఎంపిక చేశారన్నారు. కటాఫ్ మార్కులో సంబంధం లేకుండా హోం గార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్నారు. జనరల్ కేటగిరి అభ్యర్థులతో సమానంగా హోం గార్డులను పరిగణించి పాథమిక పరీక్షలో కటాఫ్ మార్కులు పెట్టడంతో దేహదారుఢ్య పరీక్షకు అర్హత కోల్పోవాల్సి వచ్చిందన్నారు.
ప్రత్యేక కేటగిరిగా పరిగణించి దేహదారుఢ్య పరీక్షకు అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వొద్దన్నారు. కౌంటర్ వేసేందుకు సమయం కావాలన్నారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. హోం గార్డులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని, కటాఫ్‌తో సంబంధం లేకుండా హోం గార్డు అభ్యర్థుల ప్రాథమిక రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా పిటిషనర్లను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: