ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వయంగా హాజరై వివరణ ఇవ్వండి.. సీఆర్​డీఏ కమిషనర్​కు హైకోర్టు ఆదేశం - High Court Key orders To CRDA Commissioner

AP High Court: హైకోర్టుకు చేరుకునే రహదారుల్లో రెండు నెలల్లో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం సెప్టెంబర్​లో ఉత్తర్వులిచ్చింది. ఆదేశాలను పెడచెవిన పెట్టడంపై ఏపీ సీఆర్​డీఏ కమిషనర్ వివేక్ యాదవ్​పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఆర్‌-5 జోన్‌ గెజిట్‌పై హైకోర్టులో వ్యాజ్యం ధాఖలైంది

High Court displeased with CRDA Commissioner
సీఆర్​డీఏ కమిషనర్​పై హైకోర్టు అసంతృప్తి

By

Published : Mar 29, 2023, 11:24 AM IST

AP High Court: విజయవాడ, మంగళగిరి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇతర రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పెడచెవిన పెట్టడంపై ఏపీ సీఆర్​డీఏ కమిషనర్ వివేక్ యాదవ్​పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషనర్​ను ఆదేశించింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

విజయవాడ, మగళరిగి, గుంటూరు నుంచి హైకోర్టుకు చేరుకునే మార్గాల్లో విద్యుత్తు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సురక్షితమైన రహదారుల నిర్మాణ, భద్రత చర్యలు చేపట్టేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. హైకోర్టుకు చేరుకునే రహదారుల్లో రెండు నెలల్లో విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేయాలని గత సంవత్సరం సెప్టెంబర్​లో ఉత్తర్వులిచ్చింది. వాటిని అమలు చేయకపోవడంతో వేణు గోపాలరావు.. సీఆర్​డీఏ కమిషనర్ పై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. కోర్టు ఆదేశించినా దీపాలు ఏర్పాటు చేయలేదన్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

ఆర్‌-5 జోన్‌ గెజిట్‌పై హైకోర్టులో వ్యాజ్యం : రాజధాని అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న జారీ చేసిన గెజిట్ (337) నోటిఫికేషన్​ను సవాలు చేస్తూ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనం సాధ్యమైనంత త్వరగా విచారించాలని, నిర్ణయం తీసుకోవడం కోసం ఫైలును ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని రిజిస్ట్రీని హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణ మోహన్ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.

రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలోని 900 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా బృహత్ ప్రణాళికలో మార్పులు చేసి ఆర్-5 జోన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దానిని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన రైతు ఆవల నంద కిశోర్ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. ఈ వ్యాజ్యంపై జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు.

గ్రామసభలలో లేవనెత్తిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదని కారుమంచి ఇంద్రనీల్ బాబు అన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించి గ్రామస్థుల నుంచి ప్రతిపాదన లేకుండానే గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి సీఆర్​డీఏకి ప్రతిపాదన పంపడం సరికాదన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు.

ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, సీఆర్​డీఏ తరపున కాసా జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. చట్ట నిబంధనల మేరకే ఆర్-5 జోన్ రూపకల్పన చేశామన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే అభ్యంతరం ఎందుకన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సూచించారు.

పిటిషనర్ తరపు న్యాయవాది జోక్యం చేసుకుంటూ రాజధాని అమరావతిలో రాజధానేతరులకు ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై తీసుకొచ్చిన సీఆర్​డీఏ సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్​లో ఉన్నాయన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తెస్తున్నానన్నారు. ఈ వ్యాజ్యాన్ని త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపినా తమకు అభ్యంతరం లేదని అదనపు ఏజీ తెలిపారు. ఇరువురు అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఫైల్​ను సీజే ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details