High Court on Kapu Reservation: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ను అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య దాఖలు చేసిన వ్యాజ్యానికి.. ప్రజాహిత వ్యాజ్య స్వభావం ఉందని హైకోర్టు సింగిల్ జడ్జి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యాన్ని పిల్‌గా పరిగణించి విచారణ జరిపేందుకు ఫైల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర నేతృత్వంలోని ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందన్ రావు ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు.
చంద్రబాబు నాయుడు హయాంలో: కాపులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.