AP High Court: క్రిమినల్ కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ బెయిలుపై బయట ఉన్న వారు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారని.. అలాంటి సందర్భాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. విదేశాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈఎల్‌పై తాను 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తిని సీఎస్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్ విజ్ఞప్తిని సీఎస్ తిరస్కరించారన్న ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది.. శాఖాపరమైన విచారణ 2021 నుంచి పెండింగ్‌లో ఉందని కోర్టుకు నివేదించారు. దాన్ని కారణంగా చూపుతూ పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
దరఖాస్తు చేసిన 21 రోజుల్లో నిర్ణయం వెల్లడించని కారణంగా అనుమతి లభించినట్లు భావిస్తున్న తరుణంలో.. అందుకు భిన్నంగా ఈఎల్ సెలవులు మంజూరు చేయకపోవడం సరికాదని న్యాయవాది పేర్కొన్నారు. ఏ నిబంధనలను కారణంగా చూపుతూ సెలవులు నిరాకరించారో అవి పిటిషనర్‌కు వర్తించవని అన్నారు. సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పిటిషనర్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు.