High Court on Jagajjanani Chits: సొమ్ము తిరిగి చెల్లింపుపై ఏ ఒక్క చందాదారుడికి అభ్యంతరం లేనప్పుడు ‘డిపాజిటర్ల చట్టం’ ఏ విధంగా వర్తిస్తుందని సీఐడీని హైకోర్టు ప్రశ్నించింది. ఈ చట్ట ప్రకారం జగజ్జనని చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కేసు ఎలా నమోదు చేస్తారని వ్యాఖ్యానించింది. బెయిలు మంజూరు చేయాలని కోరుతూ సంస్థ ఎండీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు, డైరెక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని ఏ ఒక్క చందాదారుడు ఫిర్యాదు చేయలేదన్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై ‘డిపాజిటర్ల చట్టం’ కింద సీఐడీ నమోదు చేసిన కేసు చెల్లదన్నారు. డిపాజిటర్లకు సొమ్ము తిరిగి చెల్లించడంలో విఫలమైతేనే ఆ చట్టం వర్తిస్తుందన్నారు. చిట్ నిర్వహణలో ఏదైనా లోపాలను చిట్ సహాయ రిజిస్ట్రార్ గుర్తిస్తే.. ఆ విషయాన్ని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లి సరిదిద్దుకునేందుకు వీలు కల్పించాలన్నారు. ప్రస్తుత కేసులో అందుకు భిన్నంగా కాకినాడ సహాయ రిజిస్ట్రార్ వ్యవహరించారన్నారు. నేరుగా సీఐడీకి ఫిర్యాదు చేశారన్నారు. దీని వెనుక పిటిషన్లను జైలుకు పంపాలనే దురుద్దేశం ఉందన్నారు. గతంలో నిర్వహించిన తనిఖీలలో సొమ్ము చెల్లింపు తేదీలలో తేడాలున్నాయని మాత్రమే గుర్తించారన్నారు.