Help Line For Telugu Students: మణిపూర్‌లో అల్లర్లతో తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంఫాల్ ఎన్ఐటీలోని 150 మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నారు. తాగునీరు కూడా సరిగాలేక... అధికారులు ఒకపూట మాత్రమే భోజనం అందిస్తుడంటంతో ఇబ్బందులు పడుతున్నారు. బిక్కుబిక్కుమంటూ వసతిగృహాల్లో తలదాచుకుంటున్నవిద్యార్థులకు.. వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం లేకుండా పోలీసులు జామర్లు పెట్టారు. సొంత రాష్ట్ర విద్యార్థులను వారి వారి ఇళ్లకు మణిపూర్ ప్రభుత్వం చేర్చింది. మిగిలిన ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో ఏపీ ప్రభుత్వం దిల్లీ లోని ఏపీ భవన్ ద్వారా ఇంఫాల్ లో చిక్కుకున్న వారిని సహాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే 011-23384016, 011-23387089 హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. అయితే మణిపూర్‌లో నాలుగైదు రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో 54 మంది మృతి చెందారు. ఎన్‌ఐటీ చుట్టూ బాంబుల మోతలతో... కంటిమీద కునుకు లేకుండా విద్యార్థులు భయం గుప్పెట్లో ఉన్నారు.
మణిపూర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌లో చిక్కుకున్న 70 మంది రాష్ట్ర విద్యార్థులకు భద్రతగా ఎన్‌ఐటీ క్యాంపస్ చుట్టూ ఆర్మీ బలగాలు మోహరించాయి. అయితే ఎన్‌ఐటీ క్యాంపస్‌లో 5 రోజులుగా తాగునీటి కొరత ఉందని, అలాగే క్యాంపస్‌లో ఇంటర్నెట్ లేదని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని విద్యార్థులు కోరారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. తెలంగాణ తమ విద్యార్థులను ఆదివారం విమానంలో తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వం కూడా తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని ఏపీ ప్రభుత్వానికి విద్యార్థుల వినతులు చేస్తున్నారు.