గుంటూరు నగరంలో హోటళ్లు, వాణిజ్య సముదాయాల్లో ఇతర జిల్లాల నుంచి వచ్చిన వలస కూలీలు పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. లాక్డౌన్ కారణంగా కూలీలు సొంతూళ్లకు వెళ్లలేక ఇక్కడే చిక్కుకుపోయారు. రెండు నెలలుగా వారికి పని లేదు. వారి యజమానులు కూడా తిండి పెట్టే పరిస్థితి లేదు. పనుల్లేక, తినడానికి తిండిలేక కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి పరిస్థితిని తెలుసుకున్న కొందరు యువకులు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట బృందంగా ఏర్పడ్డారు. తమ శక్తి కొద్ది నగదు జమ చేశారు.
రోడ్డు పక్కన ఆకలితో ఉండేవారికి మజ్జిగ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు అందజేయటం ప్రారంభించారు. అయితే.. కొందరు అన్నం అడగటంతో.. మరికొందరు స్నేహితులను జతచేసుకుని ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరించారు. అలా వచ్చిన నగదుతో ప్రతిరోజూ ఆహారం సిద్ధం చేసి పేదల కడుపు నింపుతున్నారు. లాక్డౌన్ కారణంగా కేటిరింగ్ వాళ్లు, వంట మనుషులు దొరికే పరిస్థితి లేక.. యువకులే స్వయంగా ఆహారం తయారు చేసి పంపిణీ చేస్తున్నారు.