గుంటూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. జిల్లాలో సుమారు 241 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 150 ఎకరాల్లో ఉద్యానపంటలు పూర్తిగా పాడైపోయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో ప్రధానంగా మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి, తాడికొండ మండలాల్లోని పంటలకు ఎక్కువ నష్టం వాటిల్లింది.
ఆ పంటలకే ఎక్కువ నష్టం..
మిర్చి, పత్తి, మినుముులు, పసుపు, చెరకు పంటలకు నష్టం ఎక్కువగా జరిగింది. ఇప్పటికే జిల్లాలో ప్రస్తుత ఖరీప్ సీజన్లో 32 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. వర్షాలు ఇంకా కొనసాగితే పంటల మనుగడకే ప్రమాదమని గుంటూరు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి వెల్లడించారు.
జనజీవన స్తంభన..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో జనజీవనం స్థంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా కృష్ణా తీర ప్రాంత మండలాల్లో వర్షాలతో పాటు వరదల ప్రభావం కనిపించింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. వాగులు, వంకలు పొంగి వంతెనల పైకి నీరు చేరటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వాహనదారులకు ఇక్కట్లు..
కొన్నిచోట్ల చిరు జల్లులు కాగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. గుంటూరు నగరంలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా కనిపించింది. ఇక దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి, అమరావతి, పెదకూరపాడు, క్రోసూరు, అచ్చంపేట, మాచర్ల, మేడికొండూరు, ఫిరంగిపురం, సత్తెనపల్లి, రాజుపాలెం మండలాల్లోనూ వర్ష ప్రభావం కనిపించింది. పెదపరిమి వద్ద కొట్టేళ్ల వాగు ఉధృతితో రోడ్డుపైన వరద ప్రవహించింది. ఫలితంగా తుళ్లూరుకు రాకపోకలకు అంతరాయం కలిగింది.
పెద్దమద్దూరు వద్ద..
అమరావతి నుంచి విజయవాడ వెళ్లే మార్గంలో పెదమద్దూరు వద్ద కొండవీటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. దుగ్గిరాల మండలం పేరుకలపూడిలో వర్షం కారణంగా వీధులన్నీ జలమయమం కాగా గ్రామంలో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని వాహనంలో వరదనీటిలోనే తరలించాల్సి వచ్చింది.