కృష్ణా పశ్చిమ డెల్టాలో కురిసిన భారీవర్షం అన్నదాతలను కడగండ్ల పాలుజేసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి 42 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, ఉద్యానపంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. గుంటూరు జిల్లా బాపట్లలో అత్యధికంగా 157.. 22 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మురుగుకాల్వలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నారుమడులు, నాట్లు వేసిన పొలాలు నీట మునిగిపోగా... వరి పొలాలు చెరువులుగా మారిపోయాయి. బాపట్ల నియోజకవర్గంలో కురిసిన కుండపోత వాన... అన్నదాతలను కలవరానికి గురి చేసింది.
బాపట్ల మండలం జమ్మలపాలెం, చెరువు, మూలపాలెం, పిన్నిబోయినవారిపాలెం, అసోదివారిపాలెం, మరుప్రోలువారిపాలెం, మురుకుండపాడు, నరసాయపాలెం, కంకటపాలెం, వెదుళ్లపల్లి, గోపాపురంలో 12 వేలఎకరాల్లో వరి పైరు, నారుమడులు నీట మునిగాయి. నల్లమడ వాగు, ఈస్ట్, వెస్ట్ స్వాంప్, మురుకుండపాడు ఉత్తర, అప్పికట్ల, గోపాపురం మురుగుకాల్వలు ప్రవహిస్తున్నాయి. కర్లపాలెం పిట్టలవానిపాలెం మండలాల్లో మరో 5 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ పంటలు దెబ్బతిన్నాయి. 1000 ఎకరాల్లో కూరగాయలు, పూల తోటలకు నష్టం కలిగింది. లోతట్టుప్రాంతాల్లో ఉన్న వరి పైరు ముంపు బారినపడింది. నీరు మరో రెండ్రోజులు ఉంటే నారుమడులు కుళ్లిపోతాయి. పంటలు మునిగిపోవడంతో రైతన్నలు వాపోయారు.