ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rain alert in AP: రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీగా..!

Rain Alert to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరద ఉద్ధృతికి జిల్లాల్లోని వాగులు, వంకలు, రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా, మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో పలు చోట్లు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 26, 2023, 3:03 PM IST

Rain Alert to AP: ఉత్తర కోస్తాంధ్ర- ఒడిశా తీరాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై బలమైన అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి అనుబంధంగా రుతుపవన ద్రోణి, ఉపరితల అవర్తనం కొనసాగుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, రాయలసీమలోను చాలా చోట్ల తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. రేపటి వరకూ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువులు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. ఆయా జిల్లాల్లో రహదారులపై మోకాలి లోతు వరద నీరు చేరింది. దీంతో వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయి.. ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.. తెలంగాణ నుంచి వస్తున్న వరదతో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పోలంపల్లి ఆనకట్ట వద్ద 12.7 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అక్కడి నుంచి కృష్ణా నదికి 56,000 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. లింగాల వద్ద వంతెన పూర్తిగా నీట మునిగింది. మంగళవారం రాత్రి నుంచి ఈ రహదారిలో వాహనాల రాకపోకలను ఆపేశారు. దిగువన ఉన్న పెనుగంచిప్రోలు వంతెన వద్ద అంచులకు తాకుతూ వరద పారుతోంది. తిరుపతమ్మ దేవాలయం ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. కేశఖండశాల, దుకాణ సముదాయం వద్దకు మూడు అడుగుల మేర నీరు చేరింది.

మున్నేరులో ఉన్న తాత్కాలిక దుకాణాలు పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. తిరుపతమ్మ ఆలయం దిగువన బోస్ పేట ప్రాంతంలో పలు ఇళ్లలోకి నీరు చేరింది. పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లోని పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెనుగంచిప్రోలు లింగగూడెం మధ్య గండి వాగు పొంగటంతో రాకపోకలు బంద్ అయ్యాయి. ముచ్చింతాల తాళ్లూరు మధ్య వాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగి ప్రవహిస్తుంది. దీనితో కంచికచర్లకు చెవిటికల్లు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడలోని ప్రధాన రహదారులు సైతం నీటమునిగిపోయాయి. హనుమాన్ జంక్షన్ బస్టాండ్​ను వరద నీరు ముచ్చెంత్తింది. ప్రయాణీకులు నిల్చునేందుకు కూడా అవకాశం లేకుండా నీరు స్తంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని నల్లమల ఘాట్ రోడ్డు వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆత్మకూరు-దోర్నాల మార్గంలో.. రోళ్లపెంట సమీపంలో కొండచరియలు, చెట్లు విరిగిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి రోడ్డుపై చెట్లు, బండరాళ్లు ఉండటంతో.. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం వాహనదారులే వాటిని తొలగించి.. రాకపోకలు సాగించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి జలదిగ్బంధంలో చిక్కుకుంది. భూపతిపాలెం జలాశయం వద్ద, దేవీపట్నం వెళ్లే రహదారిలో సుక్కరాతి గండి వద్ద కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

వైయస్సార్ కడప జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. రాత్రంతా ఓ మోస్తారుగా వర్షం కురవడంతో కడపలోని ఆర్టీసీ గ్యారేజ్​లోకి వరద నీరు చేరింది. ఆ నీటిలోనే కార్మికులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. కొత్తగా నిర్మిస్తున్న గ్యారేజీ నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో పాత గ్యారేజ్​తో కార్మికులు అవస్థలు పడుతున్నారు. వర్షానికి గ్యారేజ్​లోని పలు సామాగ్రి నీట మునిగిపోయాయి. బస్టాండ్ ప్రాంగణంలోకి నీరు రావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

ఆర్టీసీ బస్టాండ్ రోడ్డుపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగరపాలక సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తమై రోడ్లపై నిలిచి ఉన్న నీటిని తొలగిస్తున్నారు. మురికి కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్తోంది. నగరంలోని లోహియా నగర్, రామరాజు పల్లి, అల్లూరి సీతారామరాజు నగర్ నంద్యాల నాగిరెడ్డి కాలనీ, గౌస్ నగర్, గంజికుంట కాలనీ, మృత్యుంజయ కుంట, భరత్ నగర్ ప్రాంతాలు కాలనీలో రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. మరో రెండు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

విస్తారంగా కురుస్తున్న వర్షాలతో.. విజయనగరం జిల్లా మెంటాడ మండలం గిరిజన గ్రామాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రెడ్డివానివలస సమీపంలో భవానమ్మ వాగు పొంగి ప్రవహిస్తున్న కారణంగా దాన్ని దాటి అవతల ఒడ్డుకు చేరేందుకు గజంగుడ్డివలస పాఠశాల ఉపాధ్యాయులు జేసీబీని ఆశ్రయించారు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల 5 గ్రామాల గిరిజనులకు తిప్పలు తప్పటం లేదు.

ABOUT THE AUTHOR

...view details