Heavy Rains in AP: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులతో మొదలైన వర్షం.. ఉరుములు, మెరుపులు, వడగండ్లు, పిడుగులతో ప్రజలు, అన్నదాతలను బెంబెలెత్తిచింది. అకాల వర్షాల కారణంగా చాలా మంది రైతులు చేతికొచ్చిన పంటను కోల్పోయారు. పిడుగుపాటుతో పలువురు మృతి చెందారు.
పిడుగుపాటుకు ఏడుగురు మృతి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం గ్రామ రైతు చాట్ల శ్యామ్‌బాబు, కూలీలు కొరివి కృపాదానం, నీలం ప్రవీణ్.. కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటపై పట్టాలు కప్పి తిరిగి వస్తుండగా పిడుగుపాటుకు గురయ్యారు. ప్రమాదంలో శ్యామ్‌బాబు అక్కడికక్కడే చనిపోగా.. కృపాదానం స్థానిక CHCలో చికిత్స పొందుతూ మరణించారు. కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం రామానగరంలో ఇద్దరు.. కృత్తివెన్ను మండలం సంగమూడికి చెందిన రైతు కొనసాని వెంకటేశ్వరరావు పిడుగుపాటుకు ప్రాణాలొదిలారు. అవనిగడ్డ మండలం రామచంద్రపురంలో మొక్కజొన్న పంట తడవకుండా పరదాలు కప్పేందుకు వెళ్లిన వ్యవసాయ కూలీ వెంకట రామయ్య పిడుగు పాటుకు దుర్మరణం చెందారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం సామంతపూడికి చెందిన పోకూరి తిరుపతయ్య గేదెలను మేత కోసం పొలానికి తోలుకెళ్లి పిడుగు పడి మృత్యువాతపడ్డారు.
పిడుగుపాటుకు వరికుప్పలు దగ్ధం: తాళ్లూరు మండలం నాగంకొట్లపాలెం గ్రామానికి చెందిన బాలిక శిరీష వడగండ్ల ధాటికి తీవ్రంగా గాయపడింది. తల్లితో కలిసి పొలానికి వెళ్లిన శిరీషపై పెద్ద సైజు వడగండ్లు పడటంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పిడుగుపాటుకు ఐదు చోట్ల వరికుప్పలు, వరిగడ్డి వాములు దగ్ధమయ్యాయి. అకాల వర్షానికి పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న, పసుపు పంట, కల్లాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది.