భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం Heavy Rains in Andhra Pradesh: రాష్ట్రంపై వరుణుడి ప్రతాపం తగ్గినా వరద మాత్రం బీభత్సం సృష్టిస్తోంది. నదులు, వాగులు పొంగిపొరుతున్నాయి. అనేక జిల్లాల్లో వరినాట్లు నీట మునిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మున్నేరు వరదతో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
శ్రీకాకుళం జిల్లాలో వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. బూర్జ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలాలన్నీ ముంపునకు గురయ్యాయి. వరి నాట్లు నీట ముగడంతో రైతులు ఆందోళనలో మునిగిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం నుంచి రంప గ్రామానికి వెళ్లే రహదారిలో సీతపల్లి వాగుపై నిర్మించిన వంతెన నీట మునిగింది. ఏలూరు జిల్లాలోని కైకలూరు, మండవల్లి, ముదినేపల్లి, పెదపాడు, పెదవేగితో పాటు అనేక గ్రామాల్లో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వారం రోజుల లోగా వరద నీరు తొలగకపోతే.. నాట్లు పూర్తిగా కుళ్లిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Godavari Floods: గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
"ఎకరానికి దాదాపు 15వేల రూపాయల పెట్టుబడి పెట్టాము. వర్షం వల్ల పొలాల్లో నీళ్లు నిలిచిపోయాయి. అది వాననీటిలో మునిగిపోయి కుళ్లిపోయే ప్రమాదం ఉంది."- రైతు
"వారం నుంచి వర్షం పడుతోంది. దాదాపు 15 వేల వరకు ఎకరానికి పెట్టుబడి పెట్టాము. పొలాల్లో నుంచి వరద నీరు బయటక వెళ్లటం లేదు."- రైతు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలతో ఎర్ర కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంది. అప్రమత్తమైన అధికారులు నిర్వాసితులను పునరావాస కేంద్రానికి తరలించి, భోజనం సదుపాయాలు కల్పించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద మునేరు వరద ప్రవహించడంతో.. హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. మునేరులో వరద ఉద్ధృతి పెరిగింది. నిన్న సాయంత్రం 6 గంటల నుంచి పోలీసులు రెండు వైపులా ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. రాత్రి 8 గంటల వరకు వాహనాలను పంపించలేదు. జగ్గయ్యపేట మండలం గరికపడు వద్ద పాలేరు పరవళ్లు తొక్కుతుంది. అగ్రహారం వద్ద వంతెన పై నుంచి వరదనీరు ప్రవసిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కృష్ణా జిల్లాలో వరి పంట ధ్వంసమైంది. డెల్టా కింద 4.5 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. పంట మొత్తం వరద పాలైందని రైతులు ఆవేదన చెందుకున్నారు. నందివాడ మండలం పుట్టగుంట వద్ద బుడమేరు పొంగి.. వరి పొలాలను ముంచేస్తుండటంతో రైతులే స్వచ్ఛందంగా జేసీబీలతో పూడికలు తీయించుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వలన ఇప్పటికే వందలాది ఎకరాలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.