పెనుమూడి పల్లెపాలెంలో వరదకు పాడైన గృహాన్ని చూపుతున్న దంపతులు
ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి దిగువ కృష్ణానదికి లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసిన ప్రతిసారీ లంక గ్రామాల్లోని గృహాలు పెద్దసంఖ్యలో ముంపునకు గురవుతున్నాయి. రోజుల తరబడి వరద నీటిలో చిక్కుకున్న నివాసాలు పూర్తిస్థాయిలో దెబ్బతిని ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాలకు చెందిన గ్రామాలు అధికంగా వరద ముంపు బారిన పడుతున్నాయి. 2019లో కృష్ణమ్మ పరవళ్లకు జిల్లాలోని 19 గ్రామాల్లోకి వరద నీరు రాగా అందులో కొల్లూరు మండలలో 8, భట్టిప్రోలు మండలంలో 4, రేపల్లె మండలంలో ఒకటి చొప్పున ముంపునకు గురై 4 వేల గృహాలు నీట మునిగాయి. ప్రస్తుతం కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లో సుమారు 1500 ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. నీట మునిగిన వాటిలో ఇటుక, మట్టి గోడలతో పేదలు నిర్మించుకున్న పూరిళ్లే అధికంగా ఉన్నాయి.