ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Rains in AP: ఏపీలో మరో రెండు రోజులపాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు - ఏపీలో వర్షాలు అప్టేడ్స్

Rains in AP: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతూ.. ప్రధాన రహదారులు సైతం ముచ్చెత్తుతున్నాయి. మరోరెండు రోజులపాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 27, 2023, 11:07 AM IST

Rains in AP: ఉత్తర కోస్తా ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై నైరుతి రుతుపవనాల ద్రోణి క్రియాశీలకంగా మారింది. వీటి ప్రభావంతో ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు ప్రభావం క్రమంగా ఉత్తర భారత్ పైకి మారే సూచనలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా.. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి, పెన్నా వంశధార నదుల్లో ప్రవాహాలు పెరగనున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.. తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. లక్ష క్యూసెక్కులకు దాటి వరద ప్రవాహం కొనసాగుతోంది. వత్సవాయి మండలం లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలు నీట మునిగాయి. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద ఉద్ధృతికి తిరుపతమ్మ దేవాలయం వద్ద కేశఖండశాల, దుకాణాలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలులోని బోస్ పేటలో 50 ఇళ్లలోకి వరద నీరు చేరింది. పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదూరు వద్ద మున్నేరు పొటెత్తి వరద నీరు పొలాల్లో చేరింది. దీంతో సుమారు 200 ఎకరాల వరి పొలాలు నీట మునిగాయి.

పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు పక్కనే ఉన్న గార్డెన్లోకి వరద నీరు చేరటంతో ఖాళీ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి వరద మరింత పెరుగుతుందని సమాచారంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. లింగాల, పెనుగంచిప్రోలు వంతెన వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. వత్సవాయికి చెందిన డయాలసిస్ రోగి బాబురావుకు వైద్యం అత్యవసరం కావడంతో 108 వాహనంలో పెనుగంచిప్రోలు మీదుగా జగ్గయ్యపేటకు తరలించారు. పెనుగంచిప్రోలు వంతెనపై వరద ప్రవహిస్తుండటంతో 108 వాహనాన్ని పోలీసులు ఆపేశారు. రోగి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో 108 పైలెట్ సాహసం చేసి వంతెనపై నుంచి వాహనాన్ని చాకచక్యంగా బయటికి తీసుకువచ్చారు. అనంతరం జగ్గయ్యపేటకు తరలించారు.

జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వాగుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. కట్లేరు, ఎదుళ్ల, పడమటి, గుర్రపు, విప్ల, కొండ వాగుల్లో వరద మరింత పెరిగింది. తిరువూరు మండలం అక్కపాలెం వద్ద వంతెనపై నుంచి పడమటి వాగు ప్రవహిస్తుంది. తిరువూరు-అక్కపాలెం రహదారిలో కనుగుల చెరువుకు గండి పడటంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. ఈ రహదారిలో ఏకమైన మల్లమ్మ చెరువు, కనుగుల చెరువు, ప్రధాన రహదారిపై వరద నీరు మోకాళ్లోతు వరకు చేరిపోయింది. దీంతో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతుల అవస్థలు పడుతున్నారు. ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చౌటపల్లి వద్ద వంతెనపై నుంచి ఎదుళ్ల వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. ముంచింగి పుట్టు బిరిగుడ, లక్ష్మీపురం గడ్డ, పెదబయలు మండలంలో గంజిగడ్డ, పాడేరు జిమాడుగుల మండలాల్లో మత్స్య గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు కొన్నిచోట్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. డుంబ్రిగూడ మండలం కొల్లాపుట్ పంచాయతీ లోగిలిగెడ్డ రోడ్డు పై నుంచి ప్రమాదకరంగా ప్రవస్తోంది. ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది.. సాహసం చేసి గెడ్డలు దాటుతున్నారు. నిత్యం వైద్య సేవలు అందించే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది.. మారుమూల గిరిజన గూడెంలకు వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వంతెన నిర్మాణం చేపట్టి ఎనిమిది నెలలు గడిచిందని, ఏప్రిల్ నెలలో పనులు నిలుపుదల చేశారని, వెంటనే బ్రిడ్జి నిర్మిస్తే.. సుమారు 50 గ్రాములకు రాకపోకలు ఉంటాయని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details