Heavy Power Cuts In Andhra Pradesh: అప్రకటిత విద్యుత్ కోతలతో రాష్ట్రం అంధకారంగా మారుతోంది. ముఖ్యంగా రాత్రి పూట గంటల తరబడి కరెంటు పోతుండటంతో.. ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరెంటు ఎప్పుడు పోతుందో.. మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియక నానా అవస్థలతో సతమతమవుతున్నారు. గ్రామాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మళ్లీ చీకటి రోజుల్లోకి వెళ్తున్నామన్న ఆవేదన గ్రామీణుల్లో వ్యక్తమవుతోంది.
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా గాడితప్పింది. డిమాండ్‌లో భారీ పెరుగుదల లేకున్నా.. ప్రభుత్వం సరఫరా చేయలేని స్థితికి వచ్చింది అత్యవసర లోడ్ రిలీఫ్ పేరుతో సుమారు 3 మిలియన్ యూనిట్లు కోత విధించినట్లు సమాచారం. సోమవారం రాత్రి 7 నుంచి 10 గంటల వరకు కొన్ని ఫీడర్‌ల పరిధిలో విద్యుత్ కోతలు విధించినట్లు అధికారులు చెబుతున్నా.. గ్రామాల్లో ఐదారు గంటలపాటు కరెంటు లేదు. చాలా గ్రామాల్లో రాత్రి 11 తర్వాత కూడా సరఫరా పునరుద్ధరించలేదు.
Power Cut in Govt Hospital: ప్రభుత్వాసుపత్రిలో కరెంట్ కోతలు.. నరకం చూస్తున్న రోగులు..
రాష్ట్రంలో కొన్ని రోజులుగా విద్యుత్ వినియోగం 225 మిలియన్ యూనిట్ల మధ్య ఉంటోంది. ఆదివారం 225.31 ఎం.యూల డిమాండ్ ఉంది. థర్మల్ విద్యుత్ 87.93, జలవిద్యుత్ 8.24, పునరుత్పాదక, ఇతర వనరుల నుంచి 55.79 మిలియన్ యూనిట్ల చొప్పున వచ్చింది. 44.31 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కేంద్ర సంస్థల నుంచి, బహిరంగ మార్కెట్‌లో 33ఎంయూ(Million Units) విద్యుత్‌ను డిస్కంలు కొన్నాయి.
డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో కనీసం 10 నుంచి 15 ఎంయూల మేర డిస్కంలు కొనాల్సి వస్తోంది. ఇందుకు ముందుగానే డబ్బు చెల్లించాలి. రోజు మొత్తంలో విద్యుత్ కొనుగోళ్లకు సుమారు 30 నుంచి 35 కోట్ల రూపాయలు అవసరం. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో కొనుగోళ్లకు భారీ మొత్తంలో ఖర్చు చేయడంతో డిస్కంలకు నిధులు సర్దుబాటు కావడం లేదని.. ప్రభుత్వమూ సమకూర్చడం లేదని.., దాని ఫలితంగానే గాడాంధకమని తెలుస్తోంది.