ఉండేది పూరిల్లే.. కానీ కరెంట్ బిల్లు చూస్తే మాత్రం షాకే
అతను ఉండేది ఓ పూరి గుడిసెలో.. అతనికి వచ్చిన కరెంటు బిల్లు చూస్తే మాత్రం షాక్ కొట్టాల్సిందే. బిల్లు ఎక్కువ వచ్చిందని, సరి చేయాలని నాలుగు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.
అతను ఓ కారు డ్రైవర్. పూరింట్లో నివాసం ఉంటున్నాడు. నాలుగు సంవత్సరాల నుంచి తన ఇంటికి వచ్చే కరెంటు బిల్లుల్లో అవకతవకలపై అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
గుంటూరు జిల్లా.. కొల్లిపర మండలంలో నవీన్ అనే వ్యక్తి ఇంటికి రూ.33 వేలకు పైగా కరెంటు బిల్లు వచ్చింది. దీనిపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 2018లో రూ.6 వేల బిల్లు వచ్చిందని అప్పడు అధికారులను సంప్రదించగా.. మీటర్ మార్చాలని చెప్పారని తెలిపాడు. ఆ తరువాత కొత్త మీటరును అమర్చినా వివరాలను నమోదు చేయలేదన్నాడు. జనవరిలో కొత్త మీటరు వివరాలు నమోదు చేశారని.. కరెంట్ బిల్లు మాత్రం భారీగా వచ్చిందని వాపోయాడు. ఈ బిల్లుల విషయంలో ఉన్నతాధికారులను సంప్రదించగా... తమ సిబ్బంది తప్పిదం వల్లే ఎక్కువ బిల్లు వచ్చిందని.. రూ. 4,550 రూపాయలు బిల్లు చెల్లించాలని సూచించారు. ఎస్సీ కుటుంబానికి 200 మీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని.. అంత బిల్లు ఎలా వస్తుందని.. అధికారులు తప్పనిసరిగా చెల్లించాల్సిందేనని చెబుతున్నారని బాధితుడు వాపోయాడు.