రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలపటంలో కృష్ణా డెల్టాది కీలకపాత్ర. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కృష్ణా తీరంతో పాటు నాగార్జున సాగర్ ఆయకట్టు వెంట భారీగా వరి సాగు జరుగుతుంది. 3 రోజుల నుంచి నివర్ తుపాన్ ప్రభావం కారణంగా జిల్లావ్యాప్తంగా విస్తారంగా ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పంటపొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వారం రోజుల్లో వరి కోతలు చేపట్టనున్న తరుణంలో... ఈ వాన ముప్పు సంభవించింది. ఈ ఏడాది సకాలంలో పడిన వర్షాలు, సాగునీరు అందుబాటులోకి రావటంతో వరి బాగా పండింది. గింజలతో కంకులు నిండుగా ఉన్నాయి. వర్షం, గాలుల కారణంగా ఇపుడు వరిపైరు నేల వాలింది. పొలాల్లోకి చేరిన వర్షపు నీరు పైరుని కప్పేసింది. గాలుల తీవ్రతకు పైరు పూర్తిగా పడిపోయి... నీటిలో నానుతుండటంతో పంట చేతికి వచ్చే అవకాశం లేదని రైతులు వాపోతున్నారు.
వర్షానికి పడిపోయిన వరి కంకుల నుంచి మొక్కలొస్తున్నాయి. కొందరు రైతులు పైరు కోసి బోదెలు వేసినా నూర్పిడి చేయలేదు. అక్కడ కూడా పైరు నీటిలో చిక్కుకుంది. జిల్లాలోని 34 మండలాలు, 400 గ్రామాల పరిధిలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే వరిపంటకు నష్టం జరిగింది. ప్రస్తుతం అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం.. 3.10 లక్షల ఎకరాల్లో వరిపైరు నీట మునిగినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ముఖ్యంగా పశ్చిమ డెల్టాలో ఎక్కువ నష్టం జరిగింది. ఈసారి ప్రకృతి అనుకూలించటంతో ఎకరాకు 30 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వస్తుందని రైతులు భావించారు. నివర్ కారణంగా వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రభుత్వం ఖరారు చేసిన ధర రూ.1416 ప్రకారం చూసినా... వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
కృష్ణానదికి అవతల ఒడ్డున ఉన్న కృష్ణా జిల్లాలోనూ నివర్ ప్రభావం గట్టిగానే పడింది. ఈ జిల్లాలో 4.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా... సగానికి పైగా విస్తీర్ణంలోని పంట వర్షాలకు దెబ్బతింది. 2.35 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ధాన్యం తడిసిపోయి, కంకులు నేల రాలిపోతున్నాయి. పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వందలాది ఎకరాల్లో వేరుసెనగ, పత్తి, మినుము పంటలు బాగా దెబ్బతిన్నాయి.
గుంటూరు జిల్లాలో శుక్రవారం రోజు సగటు వర్షపాతం 7.3 సెంటీమీటర్లుగా నమోదైంది. బాపట్ల, దుగ్గిరాల, తెనాలి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. 2 రోజులుగా ఎడతెరపిలేని వర్షాలతో పొలాలన్నీ నీటిలోనే నానుతున్నాయి. డ్రెయిన్లు పూడుకుపోయి ఉండటంతో పంట పొలాల్లోని నీరు బయటకు వెళ్లే పరిస్థితిలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువున తాడేపల్లి మొదలుకుని రేపల్లె, బాపట్ల తీర మండలాల వరకు వాన నీటిలోనే ఓదెలున్నాయి. కొల్లూరు, భట్టిప్రోలు, వేమూరు, రేపల్లె, పొన్నూరు నియోజకవర్గాల్లోనూ వర్ష ప్రభావం ఎక్కువగానే ఉంది. పల్నాడు ప్రాంతంలోని వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కోత దశలో ఉన్న వరి పంట.. పొలంలోనే పడిపోయింది. పడిపోయిన వరి ఓదెలను నిలబెట్టేందుకు రైతులు యత్నించినా.. అప్పటికే పూర్తిగా తడిసిపోయాయి. వరి కంకి దశలో ఉందని... ఇపుడు నీటిలో నానితే గింజలు మొలకెత్తటం లేదా రంగు మారుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు.