High Court on Amaravati JAC petition: అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్ర సజావుగా జరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో సూచనలు, సలహాలతో రావాలని.. అమరావతి పరిరక్షణ సమితి, రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇరుపక్షాల సూచనల మేరకు తగిన ఆదేశాలిస్తామని వెల్లడించింది. యాత్రకు అనుమతి ఇస్తూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని.. వాటిని అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ధర్మాసనంపై ఉందని వ్యాఖ్యానించింది.
అమరావతి నుంచి అరసవల్లి వరకు అనుమతి తీసుకొని నిర్వహిస్తున్న మహాపాదయాత్రకు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి, మరికొందరు రైతులు హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేశారు. పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారంపై వాస్తవాన్ని వివరించేందుకు రైతులు పాదయాత్ర చేస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర అడుగుపెట్టినప్పటి నుంచి స్థానిక వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్నారన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక వైకాపా ఎంపీ మార్గాని భరత్ ప్రోత్సాహంతో పాదయాత్రపై పెట్రోలు, కిరోసిన్ సీసాలు విసిరారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ యాత్రకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోర్టుకు విన్నవించారు.
రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. యాత్రలో ముఖ్యమంత్రి, ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలను తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారన్నారు. వాటిని చూడాలంటూ సంబంధిత వీడియో క్లిప్పింగ్స్‌ను కోర్టు హాలులో ప్రదర్శించారు. వ్యాజ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. యాత్రకు సంఘీభావం ప్రకటిస్తే అభ్యంతరం లేదని.. కార్యక్రమం మొత్తాన్ని రాజకీయ పార్టీలే నిర్వహిస్తున్నాయని కోర్టుకు తెలిపారు. అనుమతి సందర్భంగా హైకోర్టు ఇచ్చిన షరతులను ఉల్లంఘిస్తున్నారన్నారు. అనుమతి రద్దు కోరుతూ కోర్టులో అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న ఘటనపై ఎస్పీ ఇచ్చిన నివేదికను కోర్టుకు అందజేశారు.
ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన వీడియో క్లిప్పింగ్స్‌తో తమకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది అన్నారు. విశాఖలో కాలుపెడితే కాళ్లు నరుకుతామని బెదిరిస్తున్నారని.. అన్నారు. రెచ్చగొట్టే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాదయాత్రను మధ్యలోనే అంతమెందించాలని కుట్రపన్నుతున్నట్లు తమకు సమాచారం ఉందని కోర్టుకు తెలిపారు. అసాంఘిక శక్తుల ద్వారా కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉందని వివరించారు.