Health problems Due to Poor Quality Alcohol in AP:ఆంధ్రప్రదేశ్‌ను మద్యం బాధిత అనారోగ్య సమస్యల ఉపద్రవం ముంచెత్తుతోంది. కాలేయం, క్లోమగ్రంధి దెబ్బతిని ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య గత నాలుగేళ్లుగా విపరీతంగా పెరుగుతోంది. వీరిలో పలువురి ఆరోగ్యం వేగంగా క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారు. తరచూ మద్యం తాగే అలవాటున్నా సరే.. కాలేయం దెబ్బతినాలంటే కనీసం 10-15 ఏళ్లు పడుతుంది. కానీ ఏపీలో ఓ మాదిరిగా తాగే అలవాటున్నవారికీ నాలుగేళ్లలోనే కాలేయం పాడైపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో లభించే నాసిరకం మద్యం వల్లే ఇంత త్వరగా కాలేయం పాడైపోతోందని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఈ బాధితుల్లో అత్యధికులు బడుగు, బలహీనవర్గాల పేదలే ఉంటున్నారు. రోజు కూలీలుగా పనిచేస్తూ తమకొచ్చే ఆదాయంలో సగానికిపైగా మద్యానికే వెచ్చిస్తున్నారు. నెలల వ్యవధిలోనే ఆరోగ్యం క్షీణించిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. పెద్దదిక్కు కోల్పోయి వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడుతున్నారు. బాధితుల్లో యువత కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఎగువ మధ్యతరగతి, ఉన్నతస్థాయివర్గాల వారు నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో లభించే మద్యం జోలికే వెళ్లట్లేదు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాలతో పాటు విదేశాల నుంచి ప్రీమియం బ్రాండ్లు తెప్పించుకుని అవే తాగుతున్నారు. మద్యం అలవాటు మానుకోలేక.. వారు కోరుకునే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించక తప్పనిసరి పరిస్థితుల్లో అందుబాటులో ఉన్నవాటిని తాగుతున్న పేద, మధ్యతరగతి వారే చివరికి సమిధలుగా మారి బలైపోతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అన్నిచోట్లా ఇలాంటి పరిస్థితే ఉంది. మద్యం తాగే అలవాటు కొన్నేళ్లుగా ఉన్నా.. ఇంతటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ముందెన్నడూ లేవని బాధితులు, వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈటీవీ-ఈనాడు ప్రతినిధులు పరిశీలించి.. బాధితులతో మాట్లాడినప్పుడు వారి దయనీయస్థితి వెల్లడైంది.
Guntur GGH:గుంటూరు జీజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగానికి వస్తున్నవారిలో 40శాతం మంది మద్యం తాగేవారే ఉంటున్నారు. చాలామంది కాలేయం మారిస్తే తప్ప బతకని పరిస్తితిలో ఆసుపత్రిలో చేరుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య.. 2020తో పోలిస్తే 2023లో 108శాతం పెరిగింది. అయిదారేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మద్యం తాగేవారు వివిధ సమస్యలతో ఆసుపత్రికి రావటం పెరిగిందని వైద్యుడు చెబుతున్నారు. మద్యం సంబంధిత అనారోగ్యంతో నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో నెలకు సగటున 15నుంచి 16 మంది చేరుతున్నారు. వీరిలో ఎక్కువమంది చేతులు, కాళ్లు వణకడం, నిద్రలేమి, వాంతులు, విపరీతమైన చెమట, మాట సరిగ్గా రాకపోవటం తదితర సమస్యలతో వస్తున్నారు. మద్యపానం వల్ల క్లోమగ్రంధి సమస్యలతో వస్తున్నవారి సంఖ్య తమిళనాడుతో పోలిస్తే ఏపీలోనే చాలా ఎక్కువగా ఉందని.. నరసరావుపేటకు చెందిన వైద్యుడు తెలిపారు.
Vijayawada GGH:విజయవాడ జీజీహెచ్‌లోని ఉదరకోశ వ్యాధుల విభాగానికి వస్తున్న వారిలో 30-40శాతం మంది మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే ఉంటున్నారు. ప్రతివారం సగటున 100-150 మధ్య ఓపీ ఉంటోంది. గతవారం ఓపీలో చూపించుకున్నవారిలో 90 మంది పురుషులు కాగా.. వారిలో 30 మంది మద్యపానం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారే ఉన్నారు.
Elur:ఏలూరు వైద్యకళాశాలలోని ఉదరకోశ వ్యాధుల విభాగంలో ప్రస్తుతం 40 మంది చికిత్స పొందుతుండగా.. వారిలో మద్యపానం వల్ల అనారోగ్యం బారిన పడినవారే 11 మంది ఉన్నారు. ఇలాంటి సమస్యలతో ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో 2019 కంటే ముందు నెలకు 15 మంది చికిత్స పొందేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 40కి పెరిగింది. ఉదరకోశవ్యాధుల విభాగానికి సంబంధించిన మూడు ప్రైవేటు ఆసుపత్రులకు రోజూ సగటున 500 మంది వరకూ ఓపీకి వస్తున్నారు. వీరిలో మద్యం సంబంధిత అనారోగ్యంతో వచ్చేవారే 150 మంది వరకూ ఉన్నారు.
Kakinada GGH:కాకినాడ జీజీహెచ్‌లోని వ్యసన విముక్తి కేంద్రంలో ఈ ఏడాది జనవరి-ఆగస్టు మధ్య నెలకు సగటున 260 నుంచి 270 మంది వరకూ ఔట్‌పేషెంట్లు వచ్చారు. వారిలో సగటున 27నుంచి 30 మంది వరకూ ఇన్‌పేషెంట్లుగా చేరారు.