Minister Vidadala Rajini On Kidney Racket: కిడ్నీ మోసాలపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో నిఘా పెట్టామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కిడ్నీ రాకెట్ వార్తలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. విశాఖలోని పెందుర్తి తిరుమల ఆస్పత్రి ఘటన తమ దృష్టికి రాగానే విచారణకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విశాఖ కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి ఆస్పత్రిని సీజ్ చేశారని మంత్రి వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమల ఆస్పత్రికి అసలు అనుమతులు లేవని అధికారులు గుర్తించారని పేర్కొన్నారు. ఆస్పత్రి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయ్యాయని వివరించారు.
తిరుమల ఆస్పత్రి వ్యవహారంలో మధ్యవర్తులుగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు. వారిని విచారించి అసలు నిజాలు రాబడతామన్నారు. కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టబోమని తెలిపారు. ఇటువంటి ఘటనలకు తావు లేకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని వేస్తామని స్పష్టం చేశారు. అవయవాలను వాడుకుని చట్ట విరుద్ధంగా వ్యాపారం చేసే ఆస్పత్రులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.