ప్రస్తుతం కొలకలూరు గ్రామ ప్రజల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యారోగ్య కమిషనర్ జే నివాస్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో కలిసి ఆయన గ్రామంలోని డ్రైనేజీలను పరిశీలించారు. పారిశుద్ధ్య స్థితిగతులపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటికి కోసం ఏర్పాటు చేసిన ఓవర్హెడ్ ట్యాంకను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం అనారోగ్యానికి గురైన బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తెనాలి మున్సిపాలిటి నుంచి గ్రామానికి నీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు.
ఏం జరిగిందంటే..: గుంటూరు జిల్లా కొలకలూరులో అతిసారం ప్రబలింది. గురువారం (జూన్ 30న) ఓ బాలిక మృతి చెందటంతోపాటు సుమారు 50 మంది వాంతులు, విరేచనాలతో ఆస్పత్రి పాలయ్యారు. గ్రామంలో సరైన పారిశుద్ధ్య చర్యలు లేకపోవటం, మురుగునీటి కాల్వలో తాగునీటి పైపులైన్లు ఉండటం వల్లే సమస్య తలెత్తినట్లు స్థానికులు వాపోయారు. ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనిధి అనే బాలిక వాంతులు, విరేచనాలతో గురువారం మృతి చెందింది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కాలనీ వాసులు అస్వస్థతకు గురయ్యారు. కొలకలూరు ఆరోగ్య కేంద్రంతోపాటు.. తెనాలి ప్రభుత్వాసుపత్రికి వరుసకట్టారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరు జీజీహెచ్లో కొలకలూరు బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు.