ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషజ్వరాల కట్టడికి.. నగర పాలక సంస్థ విస్తృత చర్యలు

విషజ్వరాలను అదుపు చేసేందుకు గుంటూరు నగర పాలక సంస్థ నడుం బిగించింది. వైద్య విభాగం అధికారులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య బృందాలను సమన్వయం చేస్తోంది. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తోంది.

అవగాహన చర్యలు గుంటూరులో

By

Published : Sep 25, 2019, 9:48 AM IST

మలేరియా, డెంగ్యూ జ్వరాల బాధితులతో గుంటూరు నగరంలోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. పేద, మధ్యతరగతి వర్గాలు నివసించే ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది. దోమల విజృంభణతో విష జ్వరాలు విస్తరిస్తున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు నగరపాలక సంస్థ రంగంలోకి దిగింగి. దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. వైద్య బృందాలతో కలిసి నగరంలోని వివిధ ప్రాంతాల్లో దోమల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ప్రమాదకర దోమలు వృద్ధి చెందకుండా మందుల పిచికారి చేయిస్తోంది.

నీటి నిల్వ ఉండే బావుల్లో గంబూషియా చేపలను నగరపాలక సిబ్బంది వదులుతున్నారు. ఆ చేపలు.. దోమ లార్వాలను తినేస్తాయి కాబట్టి వాటి వృద్ధి ఆగిపోతుందని సిబ్బంది చెప్పారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు జ్వరాలతో వచ్చేవారిలో డెంగ్యూ లక్షణాలు కనిపిస్తున్నాయనీ... రోజుకు 20 నుంచి 30 మంది ఇలాంటి లక్షణాలతో వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వస్తున్న డెంగ్యూ జ్వరాల్ని పరిశీలిస్తే అవి మామూలు దోమల వల్ల వచ్చినవి కాదని వైద్యులు చెబుతున్నారు. టైగర్ దోమల వల్లే ఇలాంటి ప్రమాదకర జ్వరాలు వస్తాయని వారంటున్నారు.
నగరపాలక సంస్థ ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా.. ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మురికి కాల్వలను ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని.. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మరింత విస్తృతంగా కార్యాచరణ అమలుచేయాల్సిన అవసరం ఉందన్నారు.

విషజ్వరాల కట్టడికి.. నగర పాలక సంస్థ విస్తృత చర్యలు

ABOUT THE AUTHOR

...view details