YSRCPApologizeRAJINI Twitter Trending: వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా తమిళ సినీ సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ ట్విట్టర్లో భారీగా పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడ వచ్చిన రజనీకాంత్ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకపోయినా.. వైసీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అధికార పార్టీపై ఒక్క విమర్శ చేయలేదు.. కేవలం తన చిరకాల మిత్రుడైన చంద్రబాబు విజన్‌పై మాట్లాడిన రజనీపై రాజకీయ బురద జల్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు రజకీకాంత్కు క్షమాపణలు చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ంగ్ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికే 22 వేల ట్వీట్లు పోస్టు చేశారు.
కేవలం తన ఆప్తమిత్రుడైన చంద్రబాబు దూరదృష్టిని మెచ్చుకున్న రజనీకాంత్‌పై వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడటం సరికాదనే విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజా తో పాటు మరికొందరు నేతలు.. రజనీకాంత్‌ను పరుషంగా మాట్లాడారు. ఇది రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అటు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు. ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్‌ని సైతం తిట్టించే స్థాయికి జగన్ దిగజారారని నేతలు దుయ్యబట్టారు. తాజాగా సామాజిక మాధ్యమాలలో కూడా వైఎస్సార్సీపీ నేతల వైఖరికి వ్యతిరేకంగా.. పెద్ద ఎత్తున ప్రజలు పోస్టులు పెడుతున్నారు. వైసీపీ నేతలు రజనీకాంత్‌కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
నాన్నా పందులే గుంపుగా వస్తాయి: రజనీకాంత్‌ని సపోర్ట్ చేస్తూ.. వివిధ రకాలు మీమ్స్ క్రియేట్ చేస్తూ.. వైసీపీ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు. పలు సినిమా డైలాగులు జోడించి మీమ్స్ పెడుతూ.. వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన శివాజీ మూవీలోని 'నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది' అనే డైలాగ్‌కు వైసీపీ నేతల ఫోటోలు జోడించి మీమ్స్ క్రియేట్ చేశారు.