ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడి ఆస్తుల్నే దోచేస్తున్నారు.. కమిషనర్‌గా అతడు అనర్హుడు: హైకోర్టు - tdp news

AP HIGH COURT FIRE ON DEVADAYA COMMISSIONER: దేవాదాయ కమిషనర్‌గా కొనసాగేందుకు హరి జవహర్ లాల్ అర్హుడు కాదని.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారిని కొనసాగించడం అంటే దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఏడాది నుంచి రాష్ట్రంలో పరిస్థితులను గమనిస్తున్నామని.. దేవుడి ఆస్తులు దొరికితే చాలు దోచేస్తున్నారే తప్ప.. కాపాడేవారే కరవయ్యారని మండిపడింది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 30, 2023, 7:42 AM IST

AP HIGH COURT FIRE ON DEVADAYA COMMISSIONER: ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) దేవాదాయ కమిషనర్‌పై తీవ్రంగా ఆగ్రహించింది. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై ఏకంగా దేవుడి భూముల్ని ధారాదత్తం చేస్తున్నారని.. దేవాదాయ కమిషనర్‌గా కొనసాగేందుకు హరి జవహర్ లాల్ అర్హుడు కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. దేవాదాయ శాఖలో ఇట్లాంటి అధికారిని మరికొన్ని రోజులు కొనసాగించడమంటే దొంగ చేతికి తాళాలను ఇచ్చినట్లే అవుతుందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. ఏడాది కాలంగా రాష్ట్రంలోని పరిస్థితులను గమనిస్తున్నామని, దేవుడి ఆస్తులు దొరికితే చాలు ఠక్కున దోచేస్తున్నారే తప్ప.. వాటిని కాపాడేవారే కరవయ్యారని మండిపడింది.

హరిజవహర్ లాల్ ఏమాత్రం అర్హుడు కాదు: పూర్తి వివరాల్లోకి వెళ్తే..పాత గుంటూరులోని కంచికామాక్షి ఏకాంబరేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించటంపై దాఖలైన పిటిషన్‌పై తాజాగా హైకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా దేవాలయాల ఆస్తులను పరిరక్షించకుండా అధికారులు పాపానికి పాల్పడుతున్నారని హైకోర్టు మండిపడింది. దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తూ.. అధికారులు మహాపాపం చేస్తున్నారంది. దేవుడి భూములు ఎవరి పట్టడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. మంత్రులు, ప్రజాప్రతినిధుల, రాజకీయనేతల ప్రయోజనాలు కాపాడేందుకు అధికారులు పని చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేవాదాయ కమిషనర్‌ హరిజవహర్‌ లాల్‌.. ఓ దేవస్థానానికి చెందిన భూమిని రిజిస్ట్రేషన్‌ నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. అనంతరం అలా ఉత్తర్వులు ఇచ్చే పరిధి గానీ, అధికారం గానీ కమిషనర్‌కు ఉండదని తెలిసి కూడా కమిషనర్ ఉత్తర్యులు జారీ చేయడంపై ధ్వజమెత్తింది. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తూ.. దేవాదాయ కమిషనర్‌గా కొనసాగేందుకు హరిజవహర్ లాల్ ఏ మాత్రం అర్హుడు కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

దేవుడి ఆస్తుల్ని తొలగించే అధికారం కమిషనర్‌కు లేదు: అంతేకాకుండా, దేవాదాయ శాఖలో ఇట్లాంటి అధికారిని మరికొన్ని రోజులు కొనసాగించడమంటే దొంగ చేతికి తాళాలను ఇచ్చినట్లే అవుతుందని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. నిషేధిత జాబితా నుంచి దేవాదాయకు సంబంధించిన ఎటువంటి ఆస్తులనైనా తొలగించే అధికారం మాత్రం కమిషనర్‌కు ఉండదని తేల్చి చెప్పింది. ఏదైనా ఆస్తి పొరపాటుగా రిస్ట్రేషన్‌ నిషేధిత జాబితాలో చేరితే, దానిని తొలగింపు కోసం దేవాదాయశాఖ ట్రైబ్యునల్‌లు ఆశ్రయించాలని సూచించింది. ప్రస్తుత కేసులో సంబంధిత భూమి తనకు చెందిందనిగా భావిస్తున్న ప్రైవేటు వ్యక్తి ఎ.వెంకటరత్న హర్ష.. దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించేందుకు వెసులుబాటు కల్పించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌ రావుతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

2022లో హైకోర్టులో పిటిషన్:పాతగుంటూరులోని కంచికామాక్షి ఏకాంబరేశ్వరస్వామి దేవస్థానానికి యలవర్తి కుటుంబాచార్యులు 1914వ సంవత్సరంలో రెండెకరాల భూమిని దానం చేశారు. ఆ భూమి అప్పటి నుంచి దేవాదాయ చట్టం కింద 43 రిజిస్ట్రర్‌లో నమోదు చేశారు. ఆ భూమిని రిజిస్ట్రర్‌ నుంచి తొలగించి నిషేధిత జాబితా నుంచి ప్రైవేటు వ్యక్తి అయిన. వెంకటరత్న హర్షకు దారాదత్తం చేసేందుకు వీలుగా దేవాదాయ కమిషనర్‌ హరిజవహర్‌ లాల్‌ గతేడాది జనవరిలో ఉత్తర్వులు జారీచేశారని పేర్కొంటూ జె. హేమాంగదగుప్తతోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి 2022లో హైకోర్టులో పిల్‌ వేశారు. దేవాలయ ఆస్తులను కాపాడటంలో అధికారులు విఫలమయ్యారన్నారని.. కమిషనర్‌ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది పాణిని సోమయాజి కోర్టును కోరారు.

కమిషనర్‌ను క్షమించండి: ఈ క్రమంలో దేవాదాయ కమిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ..''ఉత్తర్వులు ఇచ్చేముందు కమిషనర్‌ న్యాయసలహా తీసుకొని ఉండాల్సింది. అది మొదటి తప్పుగా భావించి కమిషనర్‌ను క్షమించండి. కమిషనర్‌పై ప్రతికూల ప్రభావం చూపే ఉత్తర్వులు ఇవ్వొద్దు. కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులను ఇప్పటికే అచేతనంగా ఉంచాము. దేవాలయ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అధికారులకు అదనపు అధికారాలు కల్పిస్తున్నాము. సంబంధిత ఫైల్‌ను కేబినెట్‌ ముందు ఉంచే ఆలోచన ఉంది'' అని అడ్వొకేట్‌ జనరల్‌ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వాదోపవాదలు విన్న న్యాయస్థానం.. కమిషనర్‌ హరిజవహర్ లాల్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details